కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇక లేరు. రాజకీయాల్లో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అత్యధిక సార్లు ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేయటంతోపాటు అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. ఆ తర్వాత గవర్నర్ గా విధులు నిర్వహించారు. రోశయ్య వయస్సు 88 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అమీర్‌పేట్‌లోని నివాసానికి రోశయ్య భౌతికకాయం తరలించారు. సందర్శకుల కోసం రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలించనున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 12.30కి మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారంలో ఉన్నప్పుతు ప్రతిపక్ష పార్టీల నేతలను ముప్పుతిప్పలు పెట్టేవారు. తనదైన వాగ్దాటితో ఎంతటి సమస్యను అయినా డీల్ చేసేవారు. కాంగ్రెస్ లో కీలక పదవులు అధిష్టించిన ఆయన ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సారి నెంబర్ టూ స్థానంలో ఉంటూ వచ్చేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయనకు సీఎం పదవి వరించింది. సీఎం పదవి నుంచి ఆయన్ను తప్పించాల్సి రావటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అప్పట్లో గవర్నర్ అవకాశం కల్పించింది. రాజకీయాల్లో ఆయన చేయని పదవులు లేవు. ఇతర నేతలతో పోలిస్తే పెద్దగా వివాదాలకు జోలికిపోకుండా రాజకీయాల్లో ఆజాతశత్రువుగా పేరుపొందారు.