Telugu Gateway
Andhra Pradesh

సీఎస్ పదవి పోయినా విజయానంద్ దే పవర్

సీఎస్ పదవి పోయినా విజయానంద్ దే  పవర్
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే విలువలు..వ్యవస్థల గురించి చాలా చెపుతారు. కానీ తన దగ్గర కు వచ్చేటప్పటికి మాత్రం అవేమి పట్టించుకోరు. వ్యవస్థలు కుప్పకూల్చారు..పద్ధతులకు తిలోదకాలు ఇచ్చారు అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పని చేశారు. పదవి విరమణ చేసిన ఐఏఎస్ లకు ప్రభుత్వంలో సలహాదారులు ..ఇతర పోస్ట్ లు గతంలో కూడా ఇచ్చారు. కానీ పదవి విరమణ చేసిన ఒక సిఎస్ కు చంద్రబాబు నాయుడు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఇప్పటి వరకు ఆయన చూసిన విద్యుత్ శాఖనే అప్పగిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా నియమించుకున్నారు. దీంతో విజయానంద్ ఏడాది పాటు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా, ఏపీట్రాన్స్కో సీఎండీ గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏడాది పాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు అని ప్రభుత్వం శనివారం నాడు జారీ చేసిన జీవో లో పేర్కొంది.

విద్యుత్ శాఖ కు సంబంధించి విజయానంద్ పై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అయినా సరే చంద్రబాబు ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఆయనకు తిరిగి ఇదే పోస్ట్ కట్టబెట్టారు అంటే ఇద్దరి మధ్య లావాదేవీల సఖ్యత ఎంత బాగా ఉందో అర్ధం అవుతుంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. వై ఎస్ జగన్ హయాంలో హవా చెలాయించిన పవర్ కంపెనీలే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దండుకుంటున్నాయి అని...దీనికి అంతటికి కారణం విజయానందే అనే విమర్శలు టీడీపీ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి. అయినా సరే చంద్రబాబు వీటి అన్నిటికి పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే కంటే తమకు తమ ప్రయోజనాలే ముఖ్యం అన్న చందంగా అసలు రాష్ట్రంలో విజయానంద్ లేకపోతే విద్యుత్ శాఖ నడవదు అన్నతరహాలో తిరిగి ఆయన్ను ఇదే శాఖలో నియమించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విద్యుత్ శాఖ విషయంలో ఇక ఆయన ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండకుండా ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా నియమించారు అనే చర్చ సాగుతోంది. ముందు నుంచి అనుకుంటున్నట్లు గానే సీఎంఓ లో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను పూర్తి స్థాయిలో టీటీడీ ఈఓ గా నియమించారు. నూతన సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్ కే జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖల పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. సిఎస్ గా ఉన్న వ్యక్తి కి రెగ్యులర్ సబ్జెక్టులు సహజంగా కేటాయించారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ సారి అన్నీ వెరైటీ గా చేస్తున్నారు అని..దీని వెనక వేరే లెక్కలే కీలక పాత్ర పోషిస్తున్నాయి అని అధికార వర్గాలే చెపుతున్నాయి.

Next Story
Share it