విజయానంద్ కే విద్యుత్ శాఖను పూర్తి గా రాసిచ్చారా!

కరెంటు ను పట్టుకుంటే షాక్ కొట్టడం ఎంత పక్కానో..ఈ వార్త కూడా అంతే షాక్ కొడుతోంది. గతంలో మంత్రి పదవి కోసం కొంత మంది ఎమ్మెల్యేలు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఒక అధికారి తన పోస్ట్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అనే వార్త ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ రాజకీయ నాయకులు...అధికారులకు ఇప్పుడు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఇలా కాదు. ఇందులో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యుత్ శాఖలో ఒక పోస్ట్ కోసం ఉన్నతాధికారి ఒకరు ఏకంగా 20 కోట్ల రూపాయల లంచం ఇచ్చాడు అంటే అక్కడ జరుగుతున్న లావాదేవీలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఆ అధికారి తరపున ఆ లంచం కూడా ఒక కంపెనీనే ఏర్పాటు చేసింది అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది అనే కంటే కొన్ని కంపెనీల చేతుల్లో ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎందుకంటే ఇందులో పోస్టింగ్ ల దగ్గర నుంచి ప్రాజెక్ట్ లు, కాంట్రాక్టు లు అన్నీ వాళ్లే డిసైడ్ చేస్తున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కంపెనీలు అంటే అందరూ కాదు..ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ లాగా కొంత మందికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్. అధికారంలో ఎవరు ఉన్న వాళ్లకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్ట్ లు అన్నిటిని కూడా మీకు కొన్ని..మాకు కొన్ని అన్న చందంగా ఎంపిక చేసిన సంస్థలకు పంచుతోంది అని చెపుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాత్ర చాలా చాలా పరిమితంగా ఉంటే...ఈ వ్యవహారాలు అన్ని తెరవెనక ఉండి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు నడిపిస్తున్నారు అని ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జగన్ హయాంలో విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించారు అని ఆరోపించిన వాళ్లే ..ఇప్పుడు అంత కంటే ఎక్కువ చేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె. విజయానందే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు ఆయనే ఏపీ ట్రాన్స్ కో సీఎండీ గా, ఏపీ జెన్కో చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. సహజంగా సిఎస్ గా ఉన్న వాళ్లకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఇవ్వటమే అరుదు. అలాంటిది ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మొత్తాన్ని చంద్రబాబు సర్కారు ఏదో గంపగుత్తగా విజయానంద్ కే అప్పగించడంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
సిఎస్ గా ఉన్న ఆయనకే విద్యుత్ శాఖ బాద్యతలు ఇవ్వటమే విచిత్రం అంటే...ఆయనకే ట్రాన్స్ కో సీఎండీ, జెన్ కో చైర్మన్ బాధ్యతలు కూడా ఇవ్వటం అంటే ఇది అంతా ఒక ఎజెండా ప్రకారమే సాగుతోంది అని చెపుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు...కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహహరిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రాజెక్ట్ ల కేటాయింపు విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్ మాల్ జరుగుతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులే ఎవరూ లేరు అన్న చందంగా విద్యుత్ శాఖ లో పోస్ట్ లు అన్ని విజయానంద్ కు మాత్రమే ఇవ్వటం అంటే ఇది అంతా ఒక ఎజెండా ప్రకారం సాగుతుంది అనే విషయం స్పష్టం అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.



