Telugu Gateway
Andhra Pradesh

నెక్స్ట్ పిలుపు ఎవరికో ?!

నెక్స్ట్ పిలుపు ఎవరికో ?!
X

ఏపీ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో దూకుడు తగ్గించినట్లు కనిపిస్తుంటే... ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. వైసీపీ మాజీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈడీ ఈ కేసు టేకప్ చేసి పలువురిని విచారించింది. ఎంతో కీలక సమాచారం కూడా సేకరించినట్లు సమాచారం. ఈ తరుణంలో ఏపీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఈ నెల 22వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఈడీ విజయసాయిరెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. ఇప్పుడు కీలక నేతలపై దృష్టి సారించినట్లు చెపుతున్నారు.ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. లిక్కర్ పాలసీ అమలు సమయంలో పెద్దఎత్తున హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందని ఈడీ అధికారుల అంచనాగా ఉంది. ఈ తరుణంలో సడన్ గా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పలువురిని విచారించిన అధికారులు.. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి కీలక సమాచారం అందించినట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఒక సారి మీడియా సాక్షిగానే విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. తర్వాత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారులు అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను కూడా ఈ కేసు లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇదే కేసు లో అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే కేసు లో ఇంకా జైలు లోనే ఉన్నారు. ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి ని విచారించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ హయాంలో సాగిన లిక్కర్ స్కాం లో వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అధికార తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

Next Story
Share it