కార్పొరేట్లకు దోచిపెడుతున్న చంద్రబాబు..లోకేష్!

ముందు వచ్చిన వాళ్ల కే సూపర్ ఆఫర్. లేట్ అయితే ఛాన్స్ ఉండదు. ఇలాంటి ఎర్లీ బర్డ్ ఆఫర్ లు రియల్ ఎస్టేట్ వెంచర్ల లో ...ప్రైవేట్ వ్యాపారాల్లోనే ఉంటాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించటానికి...అడ్డగోలు రాయితీలు ఇవ్వటానికి కూడా ‘ఎర్లీ బర్డ్ ఆఫర్లు’ ఇస్తోంది. అంతే కాదు ఈ విషయాన్ని అధికారికంగా జీఓల్లో కూడా పెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయన తనయుడు నారా లోకేష్ ల పెట్టుబడుల సాధన చూస్తుంటే వీళ్ళు రాష్ట్రం కోసం పని చేస్తున్నారా లేక...పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర సంపద దోచిపెడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది అని అధికార వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే కంపెనీల్లో కొన్ని టాప్ కంపెనీలు ఉంటే ఎక్కువ శాతం మాత్రం అంతగా బ్రాండ్ ఇమేజ్ లేని..అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కంపెనీలే ఎక్కువ ఉంటున్నాయని...వీటికి కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైన భూములు ఇవ్వటంతో పాటు రాయితీలు కూడా ఇస్తోంది.
పారిశ్రామిక ప్రాజెక్ట్ ల విషయంలోనే కాకుండా...పర్యాటక ప్రాజెక్ట్ ల విషయంలో కూడా ఇదే మోడల్ ను అనుసరిస్తోంది. 250 నుంచి 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేవాళ్లకు కూడా ప్రభుత్వం 10 సంవత్సరాల టైం పీరియడ్ లేదా 100% స్థిర మూలధన పెట్టుబడి వాళ్లకు తిరిగి వచ్చే వరకు ఏది ముందు అయితే అంత వరకు వంద శాతం నికర ఎస్ జీఎస్టి ని తిరిగి చెల్లించనున్నారు. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ లకు ఇచ్చే భూమిని తొలుత 66 సంవత్సరాలకు...ఆ తర్వాత ప్రాజెక్ట్ ను సమర్థవంతంగా అమలు చేస్తే మరో 33 సంవత్సరాలు అంటే మొత్తం 99 సంవత్సరాలు లీజ్ కు ఇవ్వబోతున్నారు. ఇది పర్యాటక ప్రాజెక్ట్ ల విషయంలో. ఈ ఏడాది జూన్ లోనే ఏపీ ప్రభుత్వం మెగ్ లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పీ సంస్థకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పక్కనే నామమాత్రపు ధరకే 15 .25 ఎకరాలు ఇస్తూ జీవో జారీ చేసింది. ఇప్పుడు ఇదే ప్రమోటర్లతో కూడిన మెగ్ లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు మెగా కన్వెన్షన్ హాల్ తో పాటు ఫైవ్ స్టార్ హిల్టన్ హోటల్ నిర్మాణానికి విశాఖపట్నంలోని మధురవాడ లో అత్యంత ఖరీదైన ఐదు ఎకరాల భూమి కేటాయించటానికి అనుమతి ఇస్తూ శనివారం నాడు జీవో జారీ చేశారు. ఇది కూడా నామమాత్రపు లీజ్ పైనే.
ఈ కంపెనీ వెనక వైసీపీ మాజీ ఎంపీతో పాటు ఒక మెగా సంస్థ కూడా ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. మరో కంపెనీ పీవీఆర్ హాస్పిటాలిటీస్ సంస్థకు హయత్ బ్రాండ్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి విశాఖపట్నం ఎండాడ లో మూడు ఎకరాలు...పెద్ద ఎత్తున రాయితీలు కలిపిస్తూ జీవో జారీ చేశారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్ ల కోసం అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. జిట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ పీవీ మాడ్యూల్ యూనిట్ ఏర్పాటుకు 198 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంటే ...ఈ సంస్థకు కూడా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు జీవో లో పేర్కొన్నారు. ఓవరాల్ గా చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఈ కంపెనీల రాకవల్ల రాష్టానికి పన్నుల రూపంలో కూడా ఎలాంటి ఆదాయం రాదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కంపెనీల విషయంలో వంద శాతం ఎస్ జీఎస్టి మినహాయింపు వస్తోంది. పోనీ వీటి ద్వారా పెద్ద ఎత్తున ఏమైనా ఉద్యోగాలు వస్తాయా అంటే ఇది చాలా చాలా పరిమితంగానే ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అనుసరిస్తున్న విధానం రాష్ట్రం కంటే కొంత మంది ఎంపిక చేసిన కంపెనీలు..పారిశ్రామిక వేత్తలకే ఎక్కువ లాభం చేసిపెడుతోంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి.



