ఒక్క ఓటు కూడా వృధా కావొద్దు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం నాడు ఏపీలో పర్యటించారు. ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే మద్దతు ప్రకటించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తోపాటు వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వైసీపీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్ కోరారు.
'రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల'ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఆదేశించారు. సమావేశం సందర్భంగా వైసీపీ ప్రజాప్రతినిధులను ద్రౌపతి ముర్ముకు పరిచయం చేశారు. సీఎం జగన్ నివాసంలో ఆమె తేనీటి విందులో పాల్గొన్నారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు ద్రౌపది ముర్ముకు వేద ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు.