ట్రంపూ..జగన్ సేమ్ టూ సేమ్
తెలుగుదేశం సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామక్రిష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, జగన్ ఒకేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ తరహాలో జగన్ వ్యవహారం ఉందని ఆరోపించారు. అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ట్రంప్ వ్యవహార శైలి ఉందని, అలాగే ఏపీలో భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. స్థానిక ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వ వితండ వాదన విడ్డూరంగా ఉందని యనమల అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమంటే చెప్పింది చేయమని కాదని, ఇటువంటి ముఖ్యమంత్రిని, వింత పార్టీని, వితండ ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా సిఎం జగన్ రెడ్డి అమలు చేయరని అన్నారు. స్వయం ప్రతిపత్తితో ఎన్నికల సంఘాన్ని పని చేయనీయరని, జగన్ పాలనలో రాష్ట్రంలో నెపోటిజం, ఫేవరిటిజం తప్ప మరేమీలేదన్నారు. ఏ అధికారంతో సీఎస్ ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.