ట్రంప్ దెబ్బకు కొత్త ఉద్యోగాలు కష్టం అంటున్న జే పీ మోర్గాన్

తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కు అమెరికా ఐటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది యువత అమెరికా లో ఐటి ఉద్యోగాలు చేస్తూ సొంత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు అనే విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచం వ్యాప్తంగా ఐటి కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తూ పోయాయి. ఇందులో పలు దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఐటి జాబ్ మార్కెట్ రికవరీ అవుతుంది అని అంతా భావిస్తున్న తరుణంలో అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్క ఐటి రంగంపై ప్రభావం చూపించటమే కాకుండా మొత్తం అమెరికా నే మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ జే పీ మోర్గాన్ మాత్రం అమెరికా ఇప్పుడు ఆర్థిక మాంద్యం లోకి చేరుకునే అవకాశాలు 60 శాతానికి పెరిగాయని తేల్చి చెప్పింది. దీనికి ప్రధాన కారణం డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలే . ఈ దెబ్బకు అమెరికా జీడీపీ కూడా తగ్గుముఖం పడుతుంది అని తెలిపింది.
దీంతో మాంద్యం వల్ల నిరుద్యోగ రేట్ పెరిగి అమెరికా లో కొత్త ఉద్యోగాలు ఉండవు అని జే పీ మోర్గాన్ వెల్లడించింది. ఇది నిరుద్యోగ యువత తో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమెరికా లో మాస్టర్స్ పూర్తి చేసుకుని ఎంతో మంది కొత్త ఉద్యోగాల వేటలో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పటిలో ఉద్యోగాలు దక్కటం అనుమానమే అన్నది ఎక్కువ మంది నిపుణులు చెపుతున్న మాట. డోనాల్డ్ ట్రంప్ దూకుడు గా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెడుతోంది అని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎవరూ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపరు. బిఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున స్పెకులేటివ్ కొనుగోళ్లు సాగాయి . ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొంత మంది మినహాయించి ఎక్కువ మంది అంటే అవసరం ఉన్న వాళ్లు మాత్రం ఇల్లు లేదా ఫ్లాట్ బుక్ చేస్తుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లో జోష్ రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది.
సార్వత్రిక ఎన్నికలు...ఇతర కారణాల వల్ల గత ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ మందగమంలో సాగుతోంది. దేశంలోని కీలక నగరాల్లో కూడా గత ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ దూకుడు చూపించలేకపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రధానంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా గత ఏడాదిన్నర కాలంగా స్తబ్దుగా నెట్టుకొస్తోంది. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు అయిన రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు కూడా ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపించాయి. వీటికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్ లో హై ఎండ్ అంటే రెండు కోట్ల రూపాయలు పైబడిన ప్రాజెక్ట్ ల అమ్మకాల్లో వేగం ఉంది కానీ మిడ్ రేంజ్, మధ్య తరగతి కొనుగోలు చేయగల ప్రాజెక్ట్ లు చాలా స్లో గా సాగుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అమరావతి పనుల్లో ఇప్పుడప్పుడే వేగం పెడుతోంది. ఇది అంతా కొలిక్కి రావటానికి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. ఈ లోగా అక్కడ కూడా పెద్ద గా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఉండటం కష్టమే అనే అంచనాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ చాలా మంది పెట్టుబడులు పెట్టి దెబ్బ తిని ఉండటంతో అంత వేగంగా ఈ సారి పెట్టుబడుల విషయంలో ఎవరూ తొందర పడరు అని రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. కారణాలు ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో రియల్ మార్కెట్ లో జోష్ రావటానికి మాత్రం ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది అనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి.