జీఎంఆర్ కు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు!

దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఒకటి. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై ఒక్కో టికెట్ పై 750 రూపాయల యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (యూడీఎఫ్ ) వసూలు చేస్తారు. అదే విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి అయితే ఒక్కొక్కరిపై 1500 రూపాయలు వసూలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు వచ్చే నెలలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు మారనున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం చేయించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే హైదరాబాద్ కంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచే దేశీయ ప్రయాణం ఖరీదు కానుంది. ఎందుకంటే ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ ఆథారిటీ (ఏఈఆర్ఏ) భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లే ఒక్కో ప్రయాణికుడిపై 835 రూపాయల యూడీఫ్ ఫిక్స్ చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ లో దిగే ప్రయాణికుడు 355 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే అంతర్జాతీయ ప్రయాణికులపై ఒక్కో టికెట్ పై 1255 రూపాయలు చెల్లించాలి.. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు 545 రూపాయలు చెల్లించాలి.
పీపీపీ విధానంలో అమలు చేసే ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ల్లో ప్రైవేట్ సంస్థలు తమ పెట్టుబడి రాబట్టుకోవడానికి ఈ యూడీఫ్ చార్జీలు వసూలు చేస్తాయి. అదే ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా( ఏఏఐ) అమలు చేసే ప్రాజెక్టుల్లో మాత్రం ఈ యూడీఫ్ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఎక్కడైనా ఈ యూడీఫ్ చార్జీలు విమాన టికెట్ లో భాగంగానే ఉంటాయి. దేశీయ ప్రయాణికుల విషయానికి వస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ యూడీఫ్ చార్జీలు ఎక్కువగా ఉండటం విశేషం. ఈ రెండు విమానాశ్రయాలు కూడా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ నిర్వహిస్తోంది. అయితే ఏఈఆర్ఏ ప్రస్తుతం ఇచ్చింది తాత్కాలిక ఆర్డర్ అని...వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. తర్వాత కాలంలో ఏఈఆర్ఏ ఫస్ట్ కంట్రోల్ పీరియడ్ కు చెందిన ఏరోనాటికల్ టారిఫ్స్ ఫిక్స్ చేయనుంది. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలంటేనే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విమర్శలు ఉన్న తరుణంలో ఇప్పుడు యూడీఫ్ చార్జీలు కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఎక్కువ ఉండటం విశేషం.
రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారి చంద్రబాబు నాయుడు సీఎం అయిన సమయంలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ టెండర్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకి దక్కగా...ఆ టెండర్లను రద్దు చేయించి...ఈ ప్రాజెక్ట్ జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కు దక్కేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పైగా అప్పటిలో ఆర్థిక శాఖ అధికారులు కూడా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ప్రతిపాదించిన మోడల్ పై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అప్పటిలోనే అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా...ఇది పెద్ద స్కాం అని ఆరోపించి...అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కు కేటాయించిన 500 ఎకరాలు భూమిని కట్ చేసి జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. రెండవ సారి అధికారంలోకి వచ్చిన వేంటనే చంద్రబాబు సర్కారు జగన్ హయాంలో కట్ చేసిన 500 ఎకరాలను తిరిగి జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని మరీ దీన్ని అమలు చేశారు.



