Telugu Gateway
Andhra Pradesh

దిశ యాప్ అన్న లాంటిదే

దిశ యాప్ అన్న లాంటిదే
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశ యాప్ మాస్ డౌన్ లోడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో యాప్ ఆవశ్యకత, ప్రాముఖ్యతలను వివరించారు. విజయవాడ సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో దీని కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. దిశ యాప్కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్ పేర్కొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు.

ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఫోన్లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story
Share it