Telugu Gateway
Andhra Pradesh

ఈ రెండేళ్లలో స్పెషల్ ఫోకస్ !

ఈ రెండేళ్లలో స్పెషల్ ఫోకస్ !
X

పెద్దలు చెప్పిన పనులకు సహకరిస్తున్న అధికారులు

పనిలో పనిగా కోట్లు వెనకేసుకుంటున్న ఆ ఐఏఎస్!

ఒకప్పుడు టెండర్లు పిలిచాక కాంట్రాక్టర్లు ఖరారు అయ్యేవారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఖరారు అయిన తర్వాతే టెండర్లు పిలుస్తున్నారు. ఆన్ లైన్ విధానం వచ్చిన తర్వాత అదెలా సాధ్యం అన్న అనుమానం రావొచ్చు ఎవరికైనా. ప్రభుత్వాలు వ్యవస్థలను అలా సెట్ చేసుకుంటున్నాయి. పైకి అంతా ఆన్ లైన్ లాగా కనిపించినా తెర వెనక ఏమి జరుగుతుందో ఏ కాంట్రాక్టర్ ను అడిగినా...ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెపుతారు. ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి గమనించిన తర్వాత ఏ కాంట్రాక్టర్ కూడా ప్రభుత్వం టెండర్ కు ముందే ఖరారు చేసిన సంస్థకు వ్యతిరేకంగా పోటీ బిడ్ వేయటం లేదు. కాదు కూడదు అని ఎవరైనా రంగంలోకి దిగితే వాళ్ళు బయటకు వెళ్లే వరకు అది అలాగే సాగుతుంది. ఎక్కడైనా తప్పనిసరి పరిస్థితి ఉంటే అక్కడ మాత్రం టెండర్లు పంచుతారు. రాజధాని అమరావతి టెండర్ల దగ్గర నుంచి విద్యుత్ ప్రాజెక్టులు ...విద్యుత్ టెండర్ల కేటాయింపులు అచ్చం ఇలాగే సాగుతున్నాయి అని తెలుగు దేశం నేతలే చెపుతున్నారు.

ఈ రెండేళ్ల కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖలో చోటు చేసుకున్న అంత అవినీతి మరో శాఖలో చోటు చేసుకుని ఉండదు అని ఒక మంత్రి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర అన్నీ కలుపుకుని 20000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు పైగా అనుమతులు మంజూరు చేయటం ద్వారానే ఒక కీలక మంత్రి తరపున చక్రం తిప్పుతున్న కిమ్ అండ్ టీం ఏకంగా 5000 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. అనుమతులు మంజూరు చేసిన ప్రాజెక్ట్ ల విషయంలో మెగావాట్ కు ఇంత లెక్కన కిమ్ టీం కలెక్షన్స్ చేసినట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఒక్క ఫ్యామిలీకి చెందిన సంస్థలకే కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే దగ్గర దగ్గర 10000 మెగావాట్ల సామర్థ్యం గల వివిధ విద్యుత్ ప్రాజెక్టులను కేటాయించారు. ఇవే కాకుండా కాంట్రాక్టులు కేటాయించిన తరహాలోనే అస్మదీయ సంస్థలకు విద్యుత్ ప్రాజెక్టులు కూడా కేటాయించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ ల వ్యవహారాలు డీల్ చేసేందుకు ఢిల్లీ స్థాయిలో కూడా కిమ్ అండ్ టీం కొంత మంది వ్యక్తులను రంగంలోకి దింపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పవర్ ఫుల్ వ్యక్తిగా ఉన్న ఒక ఐఏఎస్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించి ఆయన కూడా వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ..అందుకే ఆయనకు కూటమి ప్రభుత్వంలో అంత ప్రాధాన్యత దక్కుతుంది అని చెపుతున్నారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో మెగావాట్ కు భారీ మొత్తంలో వసూలు చేశారు అని..దీనికి ప్రధాన కారణం కేంద్రం నుంచి సబ్సిడీ ఉండటమే అని విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. తర్వాత పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్ పీ) లతో పాటు సోలార్ ప్రాజెక్టులు...ఇతర ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఆయా విభాగాల వారీగా మెగావాట్ కు ఇంత అని వసూళ్లు చేశారు...ఈ రెండేళ్ల కాలంలోనే ఈ మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలకు చేరింది అని టీడీపీ నేతలతో పాటు విద్యుత్ శాఖ వర్గాలు కూడా చెపుతున్నాయి.ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా తనకు తెలిసిపోతుంది అని...తన నెట్ వర్క్ అలా ఉంటుంది అని చెప్పే మరో కీలక మంత్రి ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడా నోరు తెరిచి మాట్లాడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయనకు దక్కే వాటా ఆయనకు దక్కటమే కాకుండా..కొన్ని ప్రాజెక్టులను కూడా ఆ మంత్రి తన కోటా కింద తీసుకోవటమే అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు.

Next Story
Share it