Telugu Gateway
Andhra Pradesh

రాజ‌మండ్రి జైలుకు దేవినేని ఉమా

రాజ‌మండ్రి జైలుకు దేవినేని ఉమా
X

ఏపీలో రాజ‌కీయాలు మ‌లుపుల మీద మ‌లుపులు తిరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమా వాహ‌నంపై రాళ్ల దాడి జ‌రిగింది. కొండ‌ప‌ల్లి ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్ ప‌రిశీల‌న‌కు వెళ్ళిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ స‌మ‌యంలోనే ఇరువ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. కానీ రాత్రి ఉమాపై ప‌లు సెక్షన్ల కింద కేసు న‌మోదు చేయ‌టం, అరెస్ట్ చేయ‌టం జ‌రిగిపోయింది. దాడులు చేసిన వారిని వ‌దిలేసి..బాధితుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయ‌టం ఏమిటంటూ టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగారు. వైసీపీ కూడా కౌంట‌ర్ ఎటాక్ కు దిగింది. దేవినేని ఉమా ద‌ళితుల‌ను దూషించార‌ని..గ‌తంలో ఆయ‌నే అక్క‌డ అక్ర‌మ మైనింగ్ ను ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు.

ఇదిలా ఉంటే బుధ‌వారం సాయంత్రం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. ఇక దేవినేని ఉమాతో పాటు డ్రైవర్ ప్రసాద్, తెలుగు యువత నేత లీలాప్రసాద్‌కి కూడా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఉమా తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆరోపించారు.

Next Story
Share it