ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ లకు జనాలు ఎందుకు అంతగా వస్తున్నారు. ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార టీడీపీ నేతల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. గత ఏడాది కాలంగా ఓటమి తర్వాత కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు అండ్ కో ఆరోపించిన లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపై భారం పడే సెకి కేసు పక్కకు పోయినా కూడా...లిక్కర్ స్కాం కేసు విషయంలో జగన్ అండ్ కో ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. జగన్ సన్నిహితులుగా పేరున్న వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇది ఫైనల్ గా జగన్ వరకు వెళుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. మొన్నటి ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసిన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి ఏ మాత్రం మారినట్లు లేదు అనే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. ఇటీవల సాక్షి టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత జగన్ తో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి ల స్పందనలు చూసి జగన్ ఇక ఎప్పటికి మారరు అనే అభిప్రాయాన్ని వైసీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సున్నిత విషయాల్లో కూడా అదే ధోరణి చూపిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇవి అన్నీ ఇలా ఉన్న తరుణంలో కొద్ది రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి తెనాలిలో, బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులతో మాట్లేడేందుకు వెళ్లిన చేసిన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం హాజరు కావటం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ తెనాలి పర్యటనే పెద్ద దుమారం రేపింది. ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉంది. పోనీ వైసీపీ అభ్యర్థులు ఏమైనా డబ్బులు పెట్టి జనాలను జగన్ మీటింగ్ లకు తీసుకువస్తున్నారా అంటే అది కూడా లేదు అని చెపుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 11 సీట్లకు పడిపోయినా కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు దగ్గర దగ్గర నలభై శాతం ఉన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో 2019 ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ 23 సీట్లు కూడా పరిమితం అయినా అప్పుడు కూడా టీడీపీ ఓటు బ్యాంకు ఇదే తరహాలో నలభై శాతం వరకు ఉంది. సీట్లలో ఎంత పెద్ద మొత్తంలో కోత పడ్డా కూడా ఈ రెండు పార్టీ ల ఓటు బ్యాంకు విషయంలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. రెండు పార్టీ లు ఇంచు మించు చెరి నలభై శాతం ఓటు బ్యాంకు ను నిలబెట్టుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఏడాది కూటమి పాలన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణం అటు వైసీపీ, ఇటు టీడీపీ అన్న తేడా లేకుండా కొంత మంది ఎమ్మెల్యేలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టానుసారం దోపిడీకి పాల్పడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో వైపు జగన్ పాలనలో ఉచితాలకు అలవాటుపడ్డ వాళ్ళు చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు ఒక్కొక్కటిగా ఆరు హామీల అమలు మొదలుపెడుతున్నా జగన్ హార్డ్ కోర్ ఓటు బ్యాంకు ను తన వైపు తిప్పుకోగలగటం అంత ఈజీ కాదు అని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఐదేళ్ల పాలనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు టీడీపీ నాయకులు..క్యాడర్ కు ఏ మాత్రం రుచించటం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నా...ఎన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా జగన్ ఎక్కడికి వెళితే అక్కడకు జనం ఎందుకింత భారీగా హాజరు అవుతున్నారు అన్నది ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికిప్పుడు కూటమిని ఓడించాలి అనే కసి ప్రజల్లో లేకపోయినా కూడా...గత ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం ప్రజలు...ముఖ్యంగా టీడీపీ కి వెన్నంటి ఉండే సెక్షన్స్ మాత్రం సంతృప్తిగా లేవు అన్నది నిజం అని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.
పైగా అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్..నాయకుల్లో పెద్దగా ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉండదు. ఈ టర్మ్ లో సొంత క్యాడర్ నుంచే చంద్రబాబు అండ్ కో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇవి అన్నీ చూస్తుంటే చెరి నలభై శాతం నికరంగా ఓటు బ్యాంకు ఉన్న రెండు పార్టీ లు ఏ చిన్న పొరపాటు చేసినా దారుణంగా దెబ్బతినటం ఖాయం. అధికారం విషయంలో ఎవరూ ఎవరికి ఎవరూ గ్యారంటీ ఇవ్వరు. ఎక్కువ కాలం అధికారంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండాలి. లేకపోతే వాళ్లపై కోపం వచ్చినప్పుడు వీళ్లకు ...వీళ్లపై కోపం వచ్చినప్పుడు వాళ్లకు అధికారం మారుతూ ఉంటుంది. తొలి సారి అధికారం చేపట్టినప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా తానే 30 సంవత్సరాలు సీఎం గా ఉండేలా పాలన సాగిస్తాను అని ప్రకటించారు. తర్వాత ఏమైందో అందరికి తెలిసిందే.



