Telugu Gateway
Andhra Pradesh

రాజకీయం ..రాజకీయమే..సినిమాలు సినిమాలే

రాజకీయం ..రాజకీయమే..సినిమాలు సినిమాలే
X

పెండింగ్ సినిమాలు పూర్తి చేసిన జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేసే అవకాశం ఉండదు అని అంతా భావించారు. హరి హర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ సమయంలో రాజకీయాల కోసం తాను సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ . కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ కూడా చేపట్టడం లేదు అన్నారు. అందరు రాజకీయ నాయకుల తరహా లోనే పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాల విషయంలోనే కాదు..ఎన్నో విషయాల్లో కూడా మాటలు మార్చారు. ఇతర నాయకులకు మాదిరిగా తనకు వ్యాపారాలు ఏమీ లేవని...తనకు పార్టీ ని నడపటానికి...ఇతర ఖర్చులకు సినిమాలు ఒక్కటే ఆధారం అంటూ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గతంలో చేసిన ప్రకటనను పక్కన పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కొత్త సినిమా కు ఒకే చేశారు. అయితే ఇది గతంలో ఓకే చేసిన ప్రాజెక్ట్ అని చెపుతున్నా కూడా...డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారికంగా ప్రకటించిన సినిమా ఇదే.

ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి అయితే..నిర్మాత రామ్ తాళ్లూరి. నిర్మాతే ఈ కొత్త సినిమా విషయాన్నీ నూతన సంవత్సరం సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. జైత్ర రామ్ మూవీ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించనున్నారు. ఇప్పటి వరకు అంతా ఉంటే గింటే పవన్ కళ్యాణ్ కు వీలు చిక్కినప్పుడు గత ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కించుకున్న ఓజీ కి సీక్వెల్ ఉంటుంది అని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కు ఓకే చేశారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పడిపోయిన హరి హర వీరమల్లు తో పాటు ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు గత ఏడాదే విడుదల అయినా సంగతి తెలిసిందే.

ఇందులో హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూడగా...ఓజీ కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కెరీర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నమోదు చేసింది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధంగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మార్చి...లేదా ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇది అంతా కూడా రామ్ చరణ్ మూవీ పెద్ది విడుదల తేదీ ఆధారంగా ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. అయితే కొత్తగా చేయనున్న సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది...ఇతర నటీ, నటుల విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Next Story
Share it