Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి!

చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి!
X

ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు చూస్తే చంద్రబాబుకు ఒక వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...మరో వైపు అంటే పవన్ కళ్యాణ్ కు అభిముఖంగా మంత్రి నారా లోకేష్ కూర్చుంటారు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రి హోదా లేకపోయినా కూడా నారా లోకేష్ కు క్యాబినెట్ సమావేశాల్లో అదే ప్రాధాన్యత లభిస్తోంది. అయితే అనధికారికంగా దక్కే ఈ ప్రాధాన్యత కాకుండా తనకు అధికారిక హోదా కోసం అంటే ఉప ముఖ్యమంత్రి పదవి కోసం నారా లోకేష్ పట్టుపడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఇదే విషయంలో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇటీవలే తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ను మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిలోకి ఎలివేట్ చేసిన విషయం తెలిసిందే.

ఇదే తరహాలో నారా లోకేష్ ను కూడా ఉప ముఖ్యమంత్రి పదవి లో కూర్చోబెట్టాల్సిందే అనే ఒత్తిడి చంద్రబాబు పై కుటుంబం నుంచి పెద్ద ఎత్తున ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అప్పుడే చంద్రబాబు తర్వాత సీఎం సీటు లోకి నారా లోకేష్ సులభంగా వెళ్ళటం సాధ్యం అవుతుంది అని.. అలా కాకుండా ఒక వైపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ఉండి...నారా లోకేష్ కేవలం మంత్రిగా ఉంటే తర్వాత తర్వాత రాజకీయం చికాకులు వచ్చే అవకాశం ఉంది అన్నది ఈ అంశాన్ని తెరమీదకు తెస్తున్న వారి వాదన. ఇప్పటికే ప్రభుత్వంలో ఒకటి రెండు శాఖల్లో తప్ప ఏ పని జరగాలన్న లోకేష్ తో చెప్పిస్తేనే పని అవుతుంది అనే ప్రచారం టీడీపీ వర్గాల్లో ఉంది. కొంత మంది మంత్రులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెపుతున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. అనధికారికంగా ప్రభుత్వంలో ఏదైనా అటు చంద్రబాబు లేదంటే నారా లోకేష్ చెపితే తప్ప ముందుకు కదిలే పరిస్థితి లేదు అన్నది టీడీపీ వర్గాల్లో సాగుతున్న చర్చ.

మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల మధ్య పలు అంశాల్లో తీవ్ర విబేధాలు రాగా మధ్యలో ఒక పత్రికాధిపతి జోక్యం చేసుకున్నట్లు కూడా టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అయినా సరే ఇప్పటికి పరిస్థితిలో పెద్ద మార్పులు ఏమి రాలేదు అని..నారా లోకేష్ ప్రతి విషయంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటున్నట్లు పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు, నారా లోకేష్ ల మధ్య అంతర్గతంగా పలు విషయాల్లో తీవ్ర విబేధాలు ఉన్నట్లు చెపుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే కాలంలో ఏమైనా లెక్క తేడా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీడీపీ ప్రభుత్వం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బిసిలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ఎవరో కొంత మంది నేతలకు మేలు చేయటం కాకుండా...ఓవరాల్ గా బిసి లకు ప్రయోజనం కలిపించటం ద్వారా తమ ఓటు బ్యాంకు ను కన్సాలిడేట్ చేసుకోవాలన్నది టీడీపీ ప్లాన్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ఏ కారణంగా అయినా తనంతట తాను బయటకు వెళ్ళాలి తప్ప..చంద్రబాబు మాత్రం పవన్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదు అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. చంద్రబాబు నాయుడు పక్క పార్టీ కి చెందిన పవన్ కళ్యాణ్ ను బాగానే మేనేజ్ చేస్తున్న నారా లోకేష్ విషయంలో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోంది అని ఒక సీనియర్ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it