Telugu Gateway
Andhra Pradesh

కీలక నేతలు అదే పనిలో!

కీలక నేతలు అదే పనిలో!
X

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది . అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా వాడే పదం సంపద సృష్టి. రాష్ట్రానికి సంపద సృష్టి ఏమో కానీ...ఆయన ఈ టర్మ్ లో మాత్రం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు...కొంత మంది బడా బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం పెద్ద ఎత్తున సంపద సృష్టించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా ఎలా అంటే రాష్ట్ర వనరులు ఉదారంగా ఇవ్వటంతో పాటు ..భవిష్యత్ లో రాష్ట్రానికి రావాల్సిన సంపదను కూడా ఆయన వాళ్ళకే దక్కేలా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖలో పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పటి కంటే మరింత దారుణంగా మారింది అనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ కి చెందిన నేతలు 22 ఏ భూముల అంశాన్ని ఒక అస్త్రంగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూపాయి పెట్టుబడి లేకుండా పట్టా భూములను ఫిర్యాదులు వచ్చాయని...ఇతర కారణాలు చెప్పి వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తామని బెదిరించటం...సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మాములుగా వాటిని జాబితా నుంచి తొలగించటానికి ప్రయత్నాలు చేయటం వంటివి కొంత మంది నేతలు చేస్తున్నారు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు ...కొంత మంది కూటమి నాయకులు ఇదే పనిలో ఉన్నట్లు ఆ శాఖ వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడే రాష్ట్రంలో భూ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయి అనే విమర్శలు ఉంటే...ఇప్పుడు ఏకంగా 22 ఏ విషయంలో అధికారాలను జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్దీఓ లకు బదలాయించే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా లో వార్తలు వచ్చాయి.

సిసిఎల్ఏ...కలెక్టర్ల దగ్గర అధికారం ఉంటే కొంతలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అని..కానీ ఇప్పుడు దీన్ని జేసీ , ఆర్దీఓల పరిధిలోకి తీసుకెళితే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చాలా చోట్ల ముఖ్యంగా భూముల ధరలు అధికంగా ఉన్న చోట కొంత మంది ప్రజాప్రతినిధులు 22 ఏ అస్త్రాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు మరింత మేలు చేసేలా ఉండాలి కానీ..అక్రమార్కులకు అది వరంగా మారకూడదు అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కువ సమస్యలు రెవెన్యూ శాఖలోనే ఉన్నాయనే పదే పదే చెపుతారు కానీ పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలపై మాత్రం ఇప్పటి వరకు నిర్ణయాలు మాత్రం తీసుకోవటం లేదు అనే చర్చ అధికార వర్గాల్లోనే ఉంది.

Next Story
Share it