చంద్రబాబు కంటే తక్కువే అప్పులు

ఇది ఏపీ సీఎం జగన్ మాట. గత కొంత కాలంగా ఆయన ఈ మాట పదే పదే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ..ప్రజలకు ఇచ్చేది తక్కువ అంటూ ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్ గా జగన్ ఇప్పుడు చంద్రబాబు కంటే తాము తక్కువ అప్పులు చేస్తూ ప్రజలకు ఎక్కువ మేలు చేస్తున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం నాడు సీఎం జగన్ వైజాగ్ లో పర్యటించారు. వాహనమిత్ర పథకం కింద డబ్బుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ...'గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా తక్కువే. వాహన మిత్ర పథకం దేశంలో ఎక్కడా లేదు. పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం మనది. గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో ఉండేది. మన ప్రభుత్వంలో దోచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది. నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్టచతుష్టయంగా తయారయ్యారు. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయం మించినవారు లేరు. నాకు ఉన్నది నిబద్ధత, నిజాయితీ, మీతోడు, దేవుడి ఆశీస్సులు'' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామని, మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని అన్నారు.