టీడీపీ లో దుమారం రేపుతున్న వ్యవహారం!

కిక్కురుమనని నేతలు
జగన్ అలా...చంద్రబాబు ఇలా !
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు రాజధాని అమరావతిని ఆపింది ఇది పూర్తి అయితే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆర్థికంగా అత్యంత బలోపేతం అవుతారు అనే. ఒక్క చంద్రబాబు నాయుడే కాకుండా కొంత మంది టీడీపీ నేతలు కూడా లాభపడితే రాజకీయగా అది తమకు ఇబ్బంది అని అమరావతిని అటకెక్కించారు. ఈ కారణంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున నష్టాపోతున్నా..రాజధాని వ్యవహారం మొత్తం గందరగోళంలో పడుతున్నా కూడా జగన్ డోంట్ కేర్ అని తాను అనుకున్నట్లే ముందుకు వెళ్లారు. ఈ విషయంలో ఆయన రాష్ట్ర కోణం...రైతుల కోణంలో ఏ మాత్రం ఆలోచించకుండా పూర్తిగా రాజకీయ కోణంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వెరైటీ గా ఈ సారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సన్నిహిత అధికారులు..జగన్ సన్నిహిత పారిశ్రామికవేత్తలు...జగన్ సన్నిహిత కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తోంది. అదే సమయంలో కొంత అస్మదీయులకు సైతం భారీగానే పనులు చేసిపెడుతోంది.
జగన్ చేసిన దానికి భిన్నంగా వైసీపీ కీలక నేతలకు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్లకు వైజాగ్ లోని దసపల్లా భూముల్లో వేల కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పించేలా కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ సన్నిహితులకు దసపల్లా భూములు ఉన్న ప్రాంతంలో వంద అడుగుల రోడ్డు కు వీఎం ఆర్ డీఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో రాబోయే ప్రాజెక్ట్ విలువ ఏకంగా పది వేల కోట్ల రూపాయలకు చేరుతుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర 30 ఫ్లోర్స్ తో భవనాలు వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో ఈ భూములు చేజిక్కించుకున్న వాళ్లకు కనక వర్షం కురవనుంది. అయితే ఇప్పుడు ఇందులో ఎవరి వాటా ఎంత అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి, టీడీపీ కిమ్, ఒక ఎంపీ పర్యవేక్షణలోనే ఇది సాగుతోంది అని...ఈ డీల్ మొత్తం సెట్ చేసింది వీళ్ళే అని టీడీపీ నేతలు చెపుతున్నారు.
విచిత్రం ఏమిటి అంటే వైసీపీ హయాంలో అసలు హక్కుదారులకు అతి తక్కువ వాటా ఇచ్చేలా ప్రభుత్వ పెద్దల అండదండలతో అభివృద్ధి ఒప్పందాలు చేసుకోగా...ఇప్పుడు ఈ బిల్డర్స్ తో కూటమికి చెందిన టీం బిగ్ డీల్ చేసుకున్నారు. ఇందుకు కొన్ని బినామీ కంపెనీలను కూడా రంగంలోకి దింపినట్లు చెపుతున్నారు. ఇందులో హై లైట్ ఏంటి అంటే ఇంకా ఎలాంటి అనుమతులు రాకుండానే దసపల్లా భూముల్లో చేపట్టనున్న హై రైజ్ బిల్డింగ్స్ కు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కింద కొంత మంది నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్లు చెపుతున్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమి ఒక ఫార్మా కంపెనీకి చెందిన వ్యక్తులతో పాటు గత ప్రభుత్వ పెద్దలకు చెందిన వాళ్ళ సన్నిహితుల దగ్గరే ఉంది. అయినా సరే కూటమి ప్రభుత్వం వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి పనులు చేసిపెడుతోంది. ఈ ప్రేమ అంతా డబ్బు ప్రేమే తప్ప మరొకటి కాదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.



