జగన్ కు 'డేంజర్ బెల్స్ '!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయింది. మరి ఇప్పుడు జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే అంశంపై ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన తెలుగు వెబ్ సైట్ సమయం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అందులో సీఎం జగన్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని స్పష్టంగా తేలింది. మే నెలలోనే పది రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్ లో ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. జగన్ మూడేళ్ల పాలన బాగాలేదని చెప్పిన వారు 64.22 శాతం ఉంటే...బాగుందని చెప్పిన వారు 17.52 శాతం, చాలా బాగుందని 9.8 శాతం బాగుందని, 8.45 శాతం మాత్రం పర్వాలేదన్నారు. తొలి ఏడాది..రెండవ ఏడాది ఫలితాల ప్రకారం చూస్తే మూడవ ఏడాది జగన్ గ్రాఫ్ గణనీయంగా తగ్గినట్లు స్పష్టం అయింది. అత్యంత కీలమైన ప్రశ్న ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నిస్తే అధికార వైసీపీకి అనుకూలంగా 30.46 శాతం మంది చెప్పగా..టీడీపీకి ఓటేస్తామని 37.54 శాతం మంది చెప్పారని..జనసేన-బిజెపి కాంబినేషన్ కు మాత్రం 26.37 శాతం మద్దతుగా ఓటేస్తామని చెప్పినట్లు తేల్చారు. 5.63 శాతం మంది ఇతరులకు ఓటేస్తామని తెలిపారు. ఇందులో జనసేన-బిజెపికి పెరిగిన ఓట్ల శాతం ఒకింత ఆశ్చర్యంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రగతి పథంలో నడిపిస్తోందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. 25.20 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 66.13 శాతం మంది కాదని బదులివ్వగా.. 8.67 శాతం మంది ఏ విషయం చెప్పలేమని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా ప్రజల నుంచి ప్రతికూల ఫలితాలే రావటం విశేషం.