Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు ఇవి డేంజర్ బెల్సా?!

జగన్ కు ఇవి డేంజర్ బెల్సా?!
X

చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చూడని నాయకుడు కాదు. పోనీ అయన ప్రసంగం ఏమైనా ఆకట్టుకునేలా ఉంటదా అంటే అదీ ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అయన పార్టీ తెలుసు...అయన పాలన తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఛాన్స్ ఆయనకే ఇచ్చారు ప్రజలు. అయన అనుభవం అక్కరకు వస్తుంది అనుకున్నారు. ప్రజల అంచనాలను అందుకోవడంలో చంద్రబాబు విఫలం కావటంతో ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు అయన కూడా ఊహించనంత స్థాయిలో 151 సీట్లు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే అంతలోనే ఇంత మార్పా. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు వెళ్లినా..విజయనగరం జిల్లాకు వెళ్లినా..చంద్రబాబు పర్యటనలకు వస్తున్న జనాలు...ఆ స్పందన అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గాలకు కూడా ఇది ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారం గా ఉంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడితే 175 కు 175 సీట్లు అని చెప్పుకుంటున్నారు కానీ..వాస్తవం ఏమిటో ఆయనకూ తెలుసనీ వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు సభలకు ఈ స్థాయిలో స్పందన ఉండటం...జనాలు రావటం అన్నది ఎవరి అంచనాలకు ఏ మాత్రం అందకుండా ఉంది. జగన్ మూడున్నరేళ్ల ఏళ్ల పాలనలో రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని విషయాన్నీ గందరగోళంలోకి నెట్టారు...ఎన్నికలకు ముందు అయన ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యేక హోదా ను అడగటం తప్ప ఏమి చేయలేము అనే స్థితికి తెచ్చారు. పోలవరం పరిస్థితి అంతే. ప్రజలకు రోడ్లు లేవు...ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావు...యువతకు భవిష్యత్తు పై పెద్ద ఆశలు లేకుండా చేశారు. జగన్ నమ్ముకున్న నవరత్నాలు ఒక్కటే ఆయన్ను మరోసారి బయట పడేస్తాయా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే మాత్రం అది అంత సులభం కాదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు సభలకు వస్తున్న జనాలు జగన్ కు మోగుతున్న డేంజర్ బెల్స్ కు సంకేతాలు అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it