వైసీపీ లో విజయసాయిరెడ్డి ట్వీట్ కలకలం!

చాలా రోజులుగా సైలెంట్ ఉంటూ వచ్చిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం నాడు చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైసీపీ కలకలం రేపుతోంది. దీని వెనక మర్మం ఏమిటి అన్నదే ఇప్పుడు ఆ పార్టీ నేతలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం లో విచారణ కోసం ఈడీ నోటీసు లు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేయటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా అసలు దేశ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయం తో ఇంటర్ లింక్ చేస్తూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైసీపీ లో ప్రకంపనలు రేపుతోంది అనే చెప్పాలి. భవిష్యత్ లో చోటు చేసుకోబోయే పరిణామాలను విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు ఉంది అని ఆ పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. జగన్ కు ఆయన తన ట్వీట్ ద్వారా ఏదో హింట్ ఇచ్చారు అనే చర్చ సాగుతోంది.
ఆదివారం నాడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇలా ఉంది. “ అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పేలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? “వారంతా అమ్ముడు పోవటమే కదా” !” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా వైసీపీ నేతలకు విజయసాయిరెడ్డి ఏదో సంకేతం పంపారు అన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.
మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ చూపిస్తున్న దూకుడు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ విజయసాయిరెడ్డి కి నోటీసు లు జారీ చేసిన ఈడీ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన ఎక్కువ శాతం ఎన్డీయే నేతలతోనే సన్నిహితంగా ఉంటున్నందున ఆయనకు ఈ స్కాం విషయంలో ఏదో కీలక సమాచారం వచ్చి ఉండొచ్చు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. పైగా జగన్ హయాంలో సాగిన లిక్కర్ స్కాం కు సంబంధించిన మొత్తం విషయాలు విజయసాయిరెడ్డికి పక్కాగా తెలుసు కాబట్టి ఆయన ఏదో లోతైన కోణంలోనే ఇది చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ వైసీపీ నాయకుల్లో సాగుతోంది.



