Telugu Gateway
Andhra Pradesh

అసలు కంటే కొసరు కే వందల కోట్లు

అసలు కంటే కొసరు కే వందల కోట్లు
X

చంద్రబాబు, నారాయణ కు తెలియకుండానే జరుగుతుందా?!

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో అయినా ..దేశం లో ఎక్కడైనా 160 కోట్ల రూపాయలు ఖర్చుపెడితే అద్భుతమైన భవనం కట్టొచ్చు. అది కూడా సర్వ హంగులతో. అది కూడా భూమి ఖర్చు లేకుండా కేవలం నిర్మాణ ఖర్చులకే ఈ మొత్తం అంటే ఆ భవనం ఏ రేంజ్ లో ఆ రేంజ్ లో కట్టుకోవచ్చు. ఈ ఖర్చుకు సెవన్ స్టార్ సౌకర్యాలు వస్తాయని ఇంజనీర్లు చెపుతున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఘనత వహించిన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కారు కేవలం పై పై హంగులకే ఈ మొత్తం ఖర్చుపెడుతోంది. అది కూడా సగానికి పైగా ఎప్పుడో నిర్మాణం పూర్తి అయిన భవనంపై. ఈ తీరు చూసి ఆయన క్యాబినెట్ లోని కొంత మంత్రులు..ఐఏఎస్ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చివరకు నూతన రాజధాని పనులను పర్యవేక్షించాల్సిన ఏపీ సిఆర్ డీఏ భవనంలోనూ అవినీతి పునాదులు బలంగా వేస్తున్నారు అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. సిఆర్ డీఏ పర్యవేక్షణ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ సారథ్యంలోనే సాగుతున్నందున ఈ వ్యవహారం వాళ్లకు తెలియకుండా జరిగే అవకాశం ఏ మాత్రం ఉండదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

ఎంత అవినీతి అయినా..ఎలాంటి అక్రమాలు అయినా క్యాబినెట్ లో పెట్టి ఆమోదింప చేస్తే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే కారణంతోనే పలు విషయాల్లో ఇదే మోడల్ ను అనుసరిస్తున్నట్లు ఒక మంత్రి వెల్లడించారు. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు..ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం అమరావతి పేరుతో ఎంత మేర ...ఎలా సంపాదించుకోవచ్చా అన్న ఆలోచనల్లో మునిగిపోయారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా అమరావతిలో కీలక ఐకానిక్ భవనాల దగ్గర నుంచి, ల్యాండ్ పూలింగ్ స్కీం లే ఔట్స్ , రోడ్ల అభివృద్ధికి సంబంధించి కేటాయించిన వేల కోట్ల రూపాయల టెండర్లలో పనులు అన్ని కూడా అస్మదీయ కంపెనీలకే ఇచ్చారు అనే విమర్శలు ఉన్నాయి.

రాజధాని అమరావతి ప్రాంతంలో 3 .62 ఎకరాల్లో ఏపీసిఆర్ డీఏ నూతన భవనాన్ని నిర్మించారు. ఇది మొత్తం 2 .42 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఈ భవన నిర్మాణ పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి టర్మ్ లోనే దగ్గర దగ్గర 82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. అప్పటిలోనే పనులు కూడా మొదలుపెట్టారు. సగానికి పైగా ఏపీసిఆర్ డీఏ భవన పనులు గతంలోనే పూర్తి అయ్యాయి. రెండవ సారి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన పనులు ఊపందుకున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే 82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ బిల్డింగ్ పనులకు శ్రీకారం చుట్టి అదనపు హంగులు...ఇతర సౌకర్యాల కోసం ఏకంగా 160 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవటం..తాజాగా ఈ కేటాయింపులు చేస్తూ జీవో జారీచేయటం జరిగిపోయాయి. ఇది చూసి అటు సిఆర్ డీఏ అధికారులతో పాటు ఇంజనీర్లు కూడా అవాక్కు అవుతున్నారు. అర్చిటెక్చరల్ వర్క్స్ తో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్క్స్ , ఏపీసిఆర్ డీఏ ఆఫీస్ వెలుపల అభివృద్ధి పనుల కోసం ఏకంగా 160 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ జీఓ 868 జారీ చేసింది. అవినీతి పీక్ కు చేరటం అంటే ఇదే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ జీవో జారీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కేటాయించిన 160 కోట్ల రూపాయలతో పాటు గతంలో ఖర్చు పెట్టిన మొత్తం కూడా కలుపుకుంటే ఒక్క సిఆర్ డీఏ భవనం పైనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టినట్లు అవుతుంది అన్నది ఈ లెక్కలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. రాజధాని అమరావతి కోసం వివిధ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ఇలా ఇష్టానుసారరం ఖర్చుపెట్టడం ఏ మాత్రం సరికాదు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Next Story
Share it