పెద్దలపై ప్రేమ...కీలక ఎంఎస్ఎంఈ పై చిన్నచూపు !

రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు తీసుకురావద్దు అని ఎవరూ చెప్పరు. ఏ రాష్ట్రంలో అయినా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సయిస్తే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు రావటంతో పాటు ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మార్గం ఏర్పడుతుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోడల్ పూర్తి రివర్స్ గా ఉంది అనే చర్చ సాగుతోంది. ఆయన ఎంత సేపూ భారీ భారీ పరిశ్రమలు..బడా బడా పారిశ్రామికవేత్తల వైపు చూస్తున్నారు తప్ప ..చిన్న, మధ్య తరహా పరిశ్రమల పై అసలు ఏ మాత్రం ఫోకస్ పెట్టరు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ఆయన వందల...వేల కోట్ల రూపాయల భూములతో పాటు రాయితీలు కూడా బడా బడా పారిశ్రామిక వేత్తలకు కల్పిస్తారు తప్ప...చిన్న, మధ్య తరహా పరిశ్రమల వైపు పెద్దగా చూడరు. వాళ్లకు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వటానికి చుక్కలు చూపిస్తారు. బడా బాబులకు..భారీగా భూములు..రాయితీలు ఇవ్వటమే కాదు...ఏకంగా వాళ్లకు ఇవి అందించటానికి ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయటంతో పాటు సావరన్ గ్యారంటీ కూడా కల్పిస్తామని ఇటీవల ప్రకటించారు.
కానీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు..ప్రోత్సహకాల కోసం చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎంఎస్ఎంఈ రంగానికి..చిన్న పరిశ్రమలకు అండదండలు అందిస్తే అటు చంద్రబాబు...ఇటు నారా లోకేష్ కు పెద్దగా ఇమేజ్ రాదు...జాతీయ స్థాయిలో మైలేజ్ రాదు. అందుకే వీళ్ళు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి అయినా ...రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి అయినా బడా బాబులకు దోచిపెట్టడానికి ఆసక్తి చూపిస్తారు తప్ప...ఎంఎస్ఎంఈ సెక్టార్ పై పెద్దగా ఫోకస్ పెట్టరు. పైకి మాత్రం ఇంటికో పారిశ్రామిక వేత్త...టాటా బిర్లాలను తయారు చేస్తా వంటి ఆకర్షణీయ నినాదాలను చంద్రబాబు గత రెండు దశాబ్దాలకు పైగా చెపుతూనే వస్తున్నారు. కానీ వాస్తవంలో ఆయన చిన్న వాళ్ళ కంటే కార్పొరేట్ సంస్థలు..బడా బడా పారిశ్రామిక వేత్తల వైపే మొగ్గుచూపుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్సెలర్ మిట్టల్ లాంటి బిల్లియనీర్ల కంపెనీలకు ఇచ్చే రాయితీలు... ప్రోత్సహకాలు, వైజాగ్ లో ఐటి సంస్థల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చే భూముల విలువలో కొంత మొత్తం చిన్న, ఎంఎస్ఎంఈ సంస్థలకు ఇచ్చినా రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రం మరో రకంగా ఉంటుంది ఒక పారిశ్రామివేత్త అబిప్రాయపపడ్డారు.
కానీ చంద్రబాబు అయినా...నారా లోకేష్ అయినా కూడా సిఐఐ లాంటి వాళ్ళతో కలిసి పెద్దలకు మేలు చేసే విధంగా వందల కోట్ల రూపాయల తో ఈవెంట్స్ నిర్వహిస్తారు కానీ...ఎంఎస్ఎంఈ సెక్టార్ పై మాత్రం ఫోకస్ పెట్టరు అనే చర్చ సాగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి అని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమల విభాగం బలహీనంగా ఉంది అని అభిప్రాయాన్ని కూడా ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులు ఉన్నారు. అంటే భారీ పరిశ్రమలకు కూడా ఆ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఉంటారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పరిశ్రమల శాఖకు ఒక కార్యదర్శి వారికి మరెన్నో ఇతర అంశాలను కూడా జోడించడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కమిషనర్ బదులు ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. పరిశ్రమలకు సంబంధించిన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ముఖ్యమైన వాటికి కూడా అదనపు బాధ్యతలే.
26 జిల్లాల కలెక్టర్లకు పారిశ్రామిక అభివృద్ధి గురించి దిశా నిర్దేశం చేయటానికి వారి కంటే పెద్ద స్థాయి అధికారులైతే బాగుంటుంది. లేదా వారి సమాన స్థాయి లేదా చిన్న స్థాయి అధికారులు దిశా నిర్దేశం చేయగలరా? అన్నదే ఇక్కడ ప్రశ్న. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు చాలామంది ఉన్నప్పటికీ, ఒక్క అదనపు సంచాలకుడిని పరిశ్రమలకు కేటాయించి మిగిలిన వారిని వేరు వేరు విభాగాల్లో నియమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కార్పొరేషన్ ని ఏర్పాటు చేసినప్పటికీ, గత పది సంవత్సరాలుగా వారు చేసిన వృద్ధి శూన్యం. అంతేకాకుండా వచ్చిన కేంద్ర నిధులను కూడా ఇప్పటికీ సరిగ్గా వినియోగించలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ ఉంది. పరిశ్రమల భూ కేటాయింపుకు ఏపీఐఏసి ఉన్నప్పటికీ, 2014లో 300 పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 100 లోపు కు వచ్చింది. పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ తో సరైన అనుబంధం లేదు. పై సంస్థలన్నీ చాలావరకు కన్సల్టెంట్ల కనుసైగలతో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిశ్రమలకు ఆర్థికంగా తోడ్పడటానికి శాసనసభ చట్టం ద్వారా ఏర్పడినప్పటికీ, వారికి ఎటువంటి కేటాయింపులు లేక, బ్యాంకుల నుండి తెచ్చిన రుణాలను పరిశ్రమలకు కేటాయించి మనుగడ సాగించే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి రిజర్వ్ బ్యాంక్ నిధులనుండి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నిధులనుండి కానీ కేటాయింపు జరిపినప్పుడు ఆ సంస్థ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడగలదు అని చెపుతున్నారు.
పరిశ్రమల శాఖలో కూడా అతి తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు జనరల్ మేనేజర్ స్థాయి అధికారి కాకుండా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా నియమించడం కూడా పారిశ్రామీకారణకు అవరోధం అని చెప్పవచ్చు. కావలసిన సంఖ్యలో ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ ఆఫీసర్స్ లేనందువలన ఔత్సాహికులకు దిశా నిర్దేశం కరువైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవరోధాలు. పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం రావటంతో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుందన్న మాట వాస్తవమైనప్పుడు, పరిశ్రమలకు సంబంధించిన వివిధ శాఖలపై దృష్టి సారించి కావలసిన సంఖ్యలో ఉద్యోగులను నియమించటం, అదేవిధంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనివ్వటానికి కావలసిన ఏర్పాట్లు చేయడం కూడా ముఖ్యం. అప్పుడే ఇంటికో పారిశ్రామిక తయారవడానికి మార్గం ఏర్పడుతుంది. గత సంవత్సరం బుడమేరు పెనుముప్పు విజయవాడలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ముంచెత్తినప్పుడు, వారికి అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు వారికి ఎటువంటి సాయం అందలేదు. మరో కీలక విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కన్సల్టెంట్స్ తో పాటు ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ) ఒక పెద్ద పవర్ సెంటర్ గా మారింది అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది.



