పవన్ కళ్యాణ్ నూ మర్చిపోయారు!

పదవులు ఇచ్చిన వాళ్ళను తప్ప..ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసిఏ) పట్టించుకోదా?. అసలు రాష్ట్రంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగేదే తక్కువ. జరిగే వాటిలో కూడా అసలు స్పోర్ట్స్ మంత్రిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి గా కడప జిల్లాకు చెందిన మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఇటీవల మహిళల ప్రపంచ కప్ టైటిల్ సాధించిన భారత టీం లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువతి శ్రీ చరణ్ కూడా ఉంది. ఆమెకు స్వాగతం పలుకుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం నాడు పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో ఏసిఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబుల ఫోటోల తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ల ఫోటోలు ప్రముఖంగా వేశారు.
అసలు స్పోర్ట్స్ కు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఏంటి సంబంధం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులు కేశినేని శివనాథ్, సానా సతీష్ లకు దక్కటం వెనక నారా లోకేష్ పాత్రే కీలకం అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అందుకే వీళ్ళు ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ లో చంద్రబాబు, నారా లోకేష్ ల ఫోటోలు పెట్టి కనీసం స్పోర్ట్స్ మినిస్టర్ ఫోటో మచ్చుకు కూడా పెట్టలేదు. గత కొంత కాలంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ను కూడా విధిగా పెడుతున్నారు. తన శాఖతో సంబంధం లేకపోయినా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ను ప్రభుత్వ ప్రకటనల్లో ప్రమోట్ చేస్తూ పోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రంగా సంబంధింత శాఖ మంత్రి ఫోటో తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా విస్మరించటంపై టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.



