Telugu Gateway
Andhra Pradesh

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రఘువీరా రెడ్డి

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రఘువీరా రెడ్డి
X

కాంగ్రెస్ పార్టీ కి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణతో పాటు పలు కీలక రాష్ట్రాల్లో పాగా వేయాలంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిన పరిస్థితి. అందుకే ఆ పార్టీ కర్ణాటక అసెంబ్లీ పై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సర్వ శక్తులు ఒడ్డుతోంది. అంచనాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉండటం సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయన ఇప్పటికే కర్ణాటక లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం బెంగళూరు సిటీ అబ్సర్వర్ గా బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో రఘువీరా రెడ్డి సొంత గ్రామం నీలకంఠాపురం సమీపంలో ఉన్న పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయన ఎప్పటినుంచో అంటే గత కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.

బుధవారం ఉదయం రఘువీరా రెడ్డి పద్మనాభ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొనటంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నేత కావటంతో రఘువీరా రెడ్డి ప్రచారం, వ్యూహాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీ ధీమా తో ఉంది. కొన్ని సంవత్సరాల పాటు వివిధ కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి రీ ఎంట్రీ విషయాన్నీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల అనంతరం ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం అయితే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఒకే సారి వస్తాయనే విషయం తెలిసిందే.

.


Next Story
Share it