లెక్కల్లో బయటపడిన ‘డబుల్ డోస్’!

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలకు ఒక పెద్ద ఆదాయవనరుగా మారిపోయింది అనే ఆరోపణలు భారీగా ఉన్నాయి. కొత్త పవర్ ప్రాజెక్ట్ లు ఇచ్చి మెగావాట్ల లెక్కన వసూళ్లు చేయటం. బొగ్గు కొనుగోళ్లలో కమిషన్లు...విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో అడ్డగోలు రేట్ల తో కంపెనీలకు మేళ్లు చేసి పెట్టి వందల కోట్ల రూపాయలు వెనకేసుకోవటం సాగుతోంది అనే విమర్శలు ప్రభుత్వంలో ఎవరిని కదిలించినా వినిపించే మాటలే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ కాంట్రాక్టులతో పాటు పరికరాల కొనుగోలుకు చెల్లిస్తున్న అధిక ధరలపై విమర్శలు ఎన్నో ఉన్నాయి. దీనిపై మీడియా లో వార్తలు వచ్చినా కూడా అంతా గప్ చుప్. ఎందుకంటే ఈ వ్యవహారం అందరికి తెలిసి జరుగుతుంది కాబట్టే ఎవరూ స్పందించరు...యాక్షన్ కు ఉపకరించరు. కారణం ఈ అక్రమాల నిధులు అందేది పెద్దలకే కాబట్టి.
ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక కీలక మంత్రి తరపున ఈ శాఖలో వసూళ్లు చేసున్నది ఆ మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే కిమ్ టీం. ఈ టీం ఢిల్లీ తో పాటు హైదరాబాద్, అమరావతి కేంద్రంలో ఈ వసూళ్ల వ్యవహారం చూసుకుంటుంది. ఎందుకంటే విద్యుత్ శాఖ వ్యవహారాలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి కాబట్టి. ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా వసూళ్ల పరంగా వివాదాలు తలెత్తలేదు. కానీ ఇప్పుడు బొగ్గు కొనుగోళ్లలో ముడుపుల వసూళ్లకు సంబంధించిన విషయంలోకి ఇద్దరి మంత్రుల మధ్య పంచాయతీ తలెత్తినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకరు ప్రభుత్వంలోని అన్ని శాఖలపై హక్కుదారుగా వ్యవహరించే వారు అయితే...మరొకరు ఆ శాఖ కు చెందిన కీలక అధికారి. ఇంతకాలం వసూళ్లు అన్ని వసూళ్లు పైవాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు... కనీసం మనం బొగ్గు కొనుగోళ్లలో అయినా వాటా తీసుకోకూడదా అన్న చందంగా ఆయన రంగంలోకి దిగి వ్యవహారం నడిపించినట్లు ఉన్నారు అనే చర్చ సాగుతోంది. అయితే ఇటీవల కీలక మంత్రి ఢిల్లీ పర్యటన సందర్బంగా హక్కుదారుగా ఫీల్ అయ్యే మంత్రికి ఈ లెక్కలు చూపించారు. ఈ లెక్కలు చూసి అవాక్కు అవటం ఆయన వంతు అయింది.
కారణం ఏంటి అంటే అందులో ఉన్న దాంట్లో సగమే ఆయన తరపున డీల్ చేసే కిమ్ టీం కి వెళ్ళింది. మిగిలిన సగం ఎక్కడకి వెళ్ళింది...ఈ లెక్కలు ఏంటో తేలాలి అని సదరు హక్కుదారు మంత్రి ఆదేశించటంతో వ్యవహారం అమరావతి చేరింది. ఇప్పుడు ఈ లెక్కల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య ముడుపుల చిచ్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది అని చెపుతున్నారు. మరో మంత్రి తరపున ఒక కీలక అధికారి ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉదాహరణ ఈ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంలో హక్కు దారు మంత్రి కి మొత్తం వందకోట్ల రూపాయలు వెళితే...అంతే మొత్తం ఆయనకు తెలియకుండా మరో మంత్రి టీం కూడా వసూళ్లు చేసింది. అయితే ఈ వసూళ్ల లెక్కలు రాబోయే రోజుల్లో మరింత పక్కాగా బయటపడే అవకాశం ఉంది అని అధికార వర్గాలు తెలిపాయి. మరి అవినీతి లెక్కల్లో తేడా వచ్చిన తర్వాత ఎవరో ఒకరిని బలి చేస్తారా ..లేక ఇద్దరు మంత్రులు ఎందుకొచ్చిన గొడవలే అని సర్దుకుపోతారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. మరి ఈ బొగ్గు ముడుపుల పంచాయతీ ఎక్కడకు చేరుతుందో చూడాలి.



