Telugu Gateway
Andhra Pradesh

కేవలం బిల్లుల సెటిల్మెంట్స్ విషయంలోనే !

కేవలం బిల్లుల సెటిల్మెంట్స్ విషయంలోనే  !
X

ఇతర వ్యవహారాలు కూడా కలిపితే ఆ మొత్తం ఎంతో!

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అవినీతి ఈ సారి పీక్ కు చేరింది అనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పై స్థాయిలోనే ఈ వ్యవహారం ఎక్కువగా ఉంది అన్నది టీడీపీ నాయకుల అభిప్రాయం. కీలక నేతల తో పాటు కొంత మంది ఐఏఎస్ ల వ్యవహహారం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ లు గత పద్దెనిమిది నెలల కాలంలోనే ఏకంగా 300 కోట్ల రూపాయలపైనే సంపాదించినట్లు ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియదా అంటే అంతా ఖచ్చితంగా తెలిసే జరుగుతుంది అని ఎక్కువ మంది చెపుతున్న మాట. ఇందులో ఒక ఐఏఎస్ అత్యంత కీలక శాఖకు చెందిన వాళ్ళు కాగా...మరొకరు సీఎంఓ కు చెందిన అధికారి అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.

ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపులకు వీళ్ళిద్దరూ కలిసి ఆరున్నర శాతం వసూలు చేశారు అని...మొత్తం ఐదు వందల కోట్ల రూపాయల చెల్లింపుల విషయంలో ఇలాగే చేశారు అని ఈ వ్యవహారం తో సంబంధం ఉన్న వర్గాలు చెపుతున్నాయి. అయితే ఇందులో తొలుత 122 కోట్లు, తర్వాత దగ్గర దగ్గర 360 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది నడిచిన తర్వాత ఇద్దరు ఐఏఎస్ ల వ్యవహారానికి కొంత బ్రేక్ పడినా కూడా తర్వాత మళ్ళీ యధావిధిగానే ఈ కార్యక్రమం సాగుతోంది అని చెపుతున్నారు. అయితే తొలుత ఇద్దరు ఐఏఎస్ కలిసి చేసిన పనిలో తర్వాత కొంత మంది కీలక నేతలు కూడా జాయిన్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇద్దరు ఐఏఎస్ లు కేవలం ఒక్క బిల్లుల విషయంలోనే ఇంత మొత్తంలో సంపాదించారు అంటే...ఇతర అంశాల్లో కూడా వీరి వసూళ్లు లెక్కకడితే అది ఏ రేంజ్ కు వెళుతుందో అర్ధం కావటం లేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాస్ వసూళ్లు జోరు చూసిన తర్వాత వాళ్ళ కింద పని చేసేవాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కూడా రంగంలోకి దిగి మొత్తం ఆపరేషన్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఒక కీలక శాఖలో పని చేసే ఐఏఎస్ దగ్గర ఉన్న మరో అధికారి కూడా కోట్లు సంపాదించాడు. అంతే కాదు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it