Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ చెపితే న‌మ్మాలి!

జ‌గ‌న్ చెపితే న‌మ్మాలి!
X

చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి క‌ట్ట‌లేరు..నేనొస్తా..రాజ‌ధాని క‌డ‌తా..రైతుల‌కు మేలు చేస్తా అంటే అంద‌రూ న‌మ్మాలి. పోల‌వ‌రం పూర్తి చేయ‌టం చంద్ర‌బాబు వ‌ల్ల కాదు..మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంది..పోల‌వ‌రం పూర్తి చేస్తుంది అంటే అంద‌రూ ఒకే అనాలి. చంద్ర‌బాబు ఎప్పుడూ ఉద్యోగుల సంక్షేమం ప‌ట్టించుకోలేదు...అధికారంలోకి వ‌చ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ ర‌ద్దు చేస్తా అంటే న‌మ్మాలి. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి..ప్ర‌త్యేక హోదా ఎలా రాదో చూస్తా అంటే అంద‌రూ నమ్మాలి. నేను 25 అడిగితే మీరు 22 ఎంపీ సీట్లే ఇచ్చారు కాబ‌ట్టే ప్ర‌త్యేక హోదా తేలేక‌పోయాన‌ని చెప్పినా కూడా న‌మ్మాలి. కేసుల వ‌ల్ల లాలూచీ ప‌డి విభ‌జ‌న హామీల‌పై కూడా చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు అంటే న‌మ్మ‌క ఏమి చేస్తారు. మ‌రి అధికారంలోకి వ‌చ్చి మూడున్న‌ర సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా అటు తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోలేక‌పోయినా..కేంద్రం నుంచి సాధించాల్సిన‌వి సాధించక‌పోయినా అది కూడా ఏపీ మంచి కోస‌మే అని అంద‌రూ న‌మ్మితీరాలి. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి భేషుగ్గా ఉంద‌ని జ‌గ‌న్ చెపితే న‌మ్మితీరాలి. ఉద్యోగుల టీఏ, డీఏ బిల్లులు ఇవ్వ‌లేని స్థితిలో ఉన్నా..రాష్ట్ర చ‌రిత్ర‌లోనే టెండ‌ర్లు పిలిచినా కాంట్రాక్ట‌ర్లు వాటివైపు చూడ‌ని ప‌రిస్థితి ఉన్నా ఆర్ధిక ప‌రిస్థితి బ్ర‌హ్మండంగా ఉన్న‌ట్లే లెక్క‌.

ఎందుకంటే జ‌గ‌న్ కు ఎక్క‌డా..ఎప్పుడూ ఏ ఇబ్బంది కాన‌ప్పుడు ఆర్ధిక ప‌రిస్థితి బాగున్న‌ట్లే లెక్క‌ క‌దా?. రోడ్లు లేక ఇబ్బందులు ప‌డితే అది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌. జీతాలు స‌కాలంలో రాక, పెన్ష‌న‌ర్లు పెన్ష‌న్ల కోసం ఇబ్బంది ప‌డితే అది వాళ్ల స‌మ‌స్య‌. అస‌లు ఎవ‌రైనా మ‌ద్యం అమ్మ‌కాల‌పై ఆధార‌ప‌డి ప్ర‌భుత్వాన్ని న‌డుపుతారా అని చంద్ర‌బాబును గ‌ట్టిగా ప్ర‌శ్నించి..మ‌ద్యం ఆదాయం రాకూడ‌ద‌ని..ప‌థ‌కాలు ఆగిపోవాల‌ని కొంత మంది కుట్ర చేస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా చెపితే అంద‌రూ ఆ మాట‌ల‌ను న‌మ్మితీరాలి. అస‌లు దావోస్ పర్య‌ట‌న‌లు ఎందుకు దండ‌గా అని విమ‌ర్శించిన నోటితోనే తాము దావోస్ వెళ్లి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించామ‌ని చెపితే కూడా న‌మ్మాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు ఆర్ధికంగా బాగుంది..పారిశ్రామికంగా దూసుకెళుతుంది..ర‌హదారులు ర‌య్ ర‌య్ మంటూ వెళ్ల‌మ‌ని స్వాగ‌తం ప‌లుకుతున్నాయి..ఇది నిజం. న‌మ్మితీరాల్సిందే. న‌మ్మ‌క‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.

Next Story
Share it