పీకుడు భాషలోకి దిగిన సీఎం జగన్
ఫైటర్ గా వచ్చి ఫ్రస్టేషన్ లోకి సీఎం!
ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు మంచి ఫైటర్ గా పేరుంది. ఎవరు ఎంతగా అవమానించినా ..ఎన్ని విమర్శలు చేసినా అన్నింటిని అధిగమించి గత ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించారు. గత రెండు రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఫైటర్ కాస్తా ఫ్రస్టేషన్ లోకి వెళుతున్నట్లు కన్పిస్తోంది. గురువారం నాడు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోపాటు మీడియాపై విమర్శలు చేశారు. ఇది ఎప్పుడూ చేసేదే. అందులో పెద్దగా విశేషమేమీలేదు. అయితే ఈ సారి కాస్త భిన్నంగా శాపనార్ధాలు పెట్టారు. అసూయ పడితే బీపీ, గుండెపోట్లు వచ్చి టిక్కెట్ తీసుకుంటారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ప్రతిపక్షంలో ఉండగా ఇదే నేతలను జగన్ ఢీకొట్టారు. అలాంటిది ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు..అపరిమిత అధికారాలు..ఆర్ధిక వనరులు ఉండి ఎందుకింత బేలగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అయినా..పవన్ కళ్యాణ్, మీడియా తప్పులు చేసినా ఎత్తిచూపటంలో తప్పులేదు. ఆ పని చేయటానికి జగన్ కు ఇప్పుడు గతంతో పోలిస్తే అన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆయన సీఎంగా ఉండి శాపనార్ధాలు పెట్టడం..తాజాగా బహిరంగ సభలో పీకుడు భాష వాడి అనుచిత వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. శుక్రవారం నాడు జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ' ఎన్ని సమస్యలు..ఎన్ని కష్టాలు వచ్చినా ఇవేమీ నన్ను కదిలించలేవు. ఇవేమీ కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెబుతున్నా భరోసా ఇస్తూ. దేవుడి దయతో..మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను.
దేవుది దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకూ వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను' అంటూ జగన్ ఓ బహిరంగ కార్యక్రమంలో యాక్షన్ చేసి మరీ చూపించారు. ఈ సమావేశంలోనే పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ ఆరోపించారు. నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, యెల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.