కరోనా తగ్గాక గ్రామ సచివాలయాల సందర్శనకు జగన్
కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏపీ మెరుగైన స్థితిలో ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య శాఖ సిబ్బంది ఎంతో సమర్ధవంతంగా పనిచేశారని ప్రశంసించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే కనుక దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. దీంతో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టగానే గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం 'స్పందన' కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని సీఎం జగన్ తెలిపారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్ధిక కార్యకలాపాల కోసమే జిల్లాల్లో కర్ప్యూను సడలించినట్లు తెలిపారు.