రాష్ట్రంలో సుపరిపాలనకు దుష్టచతుష్టం అడ్డు
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ పాలన వద్దంటూ.. చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని ఆగ్రహం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అదే చెబుతున్నారని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉచిత పథకాలు ఇవ్వొద్దని, ఇకపై ఆ పథకాలు ఆపాలంటున్నారన్నారు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఏపీ శ్రీలంకలా మారుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబులా మోసం చేస్తే ఏపీ అమెరికా అవుతుందట... రాక్షసులు, దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని, ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఇంత మంది జరుగుతున్నా కూడా చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని మండిపడ్డారు. ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్, రామోజీరావు, టీవీ5 అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారని, పేదలకు మంచి చేయొద్దని అంటున్నారని సీఎం ఆరోపించారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉందని, మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలిపారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని సీఎం అన్నారు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వమని, టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని, తన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.