Telugu Gateway
Andhra Pradesh

జగన్ నోట ఈ సారి వినిపించని ఆ మాట

జగన్ నోట ఈ సారి వినిపించని ఆ మాట
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అనే అధికార వైసీపీ కి బిగ్ షాక్. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు అన్నీ ప్రతిపక్ష టీడీపీ కే పోవటం వైసీపీ కి ఊహించని పరిణామమే. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో వచ్చిన ఈ ఫలితం టీడీపీ కి బూస్ట్ ఇస్తుంటే ...అధికార వైసీపీ కి ఇది ఒక వార్నింగ్ బెల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోకల్ బాడీ సీట్లు, టీచర్ ల ఎమ్మెల్సీలను వైసీపీ నే దక్కించుకున్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఒక్కటికూడా అధికార పార్టీకి రాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ గత కొంత కాలంగా ఎందుకు 175 కి 175 సీట్లు ఎందుకు రావు అంటూ మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు..ఇప్పుడు ఇంత చేశాక 175 ఎందుకు సాధ్యం కాదు అంటూ అయన పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బ బాగానే పడినట్లు ఉంది. ఆదివారం నాడు తిరువూరు లో జగనన్న విద్య దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఊసు ఎత్తలేదు...అదే సమయంలో 175 సీట్ల అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. ఫలితాలు పూర్తిగా వైసీపీ అనుకూలంగా ఉంటే అయన ఇలాంటి సభల్లోనే మాట్లాడుతారు. కానీ ఎమ్మెల్సీ ఫలితాలపై మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇది చూసిన వారు జగన్ లో ఇంతలోనే అంత మార్పా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తిరువూరు సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తాజాగా రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి ...గవర్నమెంట్ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవు అనే మాటను తుడిచేస్తా. రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి కార్పొరేట్ బడులు..గవర్నమెంట్ బడులతో పోటీ పడేలా చేస్తా.ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ కాబోతుంది. అప్పుడు కార్పొరేట్ బడులు వీటితో పోటీపడాల్సి వస్తుంది అంటూ మాట్లాడారు. కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని దుష్ట చతుష్టయం తో తాను ప్రజలకు మంచి చేయటానికి పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. తాను ప్రజలకు మంచి చేయకపోతే ఎందుకు ఈ తోడేళ్ళు ఏకమవుతున్నాయి అని అడుగుతున్నా. ఏ సినిమాకు వెళ్లినా హీరో నే నచ్చుతాడు కానీ.విలన్లు నచ్చరు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో కూడా ప్రకంపనలు రేపు తున్నాయి. అది చాలా చిన్న సెక్షన్...అసలు వాళ్ళు మా ఓటర్లు కారు...మా ఓటర్లు వేరే ఉన్నారు అంటూ అయన స్పందించారు. అంటే నవరత్నాల లబ్దిదారులను వైసీపీ ఓటర్లుగా చూస్తుంది...ఓట్ల కోసమే తాము స్కీం లు అమలు చేస్తున్నాము అనే తరహాలో సజ్జల మాటలు ఉన్నాయని పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అయన మాటలు వైసీపీ కి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయని..గ్రాడ్యుయేట్లు మా సెక్షన్ కాదు అని చెప్పటం ఏమిటి అంటూ అయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Next Story
Share it