Telugu Gateway
Andhra Pradesh

నా మీద ప‌డి ఏడిస్తే పోతారు జాగ్ర‌త్త‌

నా మీద ప‌డి ఏడిస్తే పోతారు జాగ్ర‌త్త‌
X

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శలు గుప్పించారు. గ‌తంతో పోలిస్తే ఈ సారి కాస్త డోస్ పెంచారు. టీడీపీ, జ‌న‌సేన‌ల‌తోపాటు ఎల్లోమీడియా అంతా దొంగ ముఠాల అంటూ మండిప‌డ్డారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తే ఏపీ శ్రీలంక అవుతుంద‌ని..ఇచ్చిన హామీలు అమలు చేయ‌కుండా మోసం చేస్తే ఏపీ అమెరికా అవుతుందా అంటూ మండిప‌డ్డారు. అంతే కాదు..శాప‌నార్ధాలు పెట్టారు. ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డీబీటీ) స్కీమ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు వేల కోట్లు పంపిణీ చేస్తున్నందుకు ఈ దొంగ ముఠాకు, ఎల్లో మీడియాకు ఎక్క‌డ లేని అసూయ వ‌స్తోంద‌ని మండిప‌డ్డారు. అసూయ మ‌రీ ఎక్కువైతే బీపీలు, గుండెపోట్లు వ‌స్తాయ‌ని..ఆ త‌ర్వాత టిక్కెట్ తీసుకుంటార‌ని (పైకిపోతార‌ని) వ్యాఖ్యానించారు. ఇలా బ‌హిరంగ స‌భ‌లో ఏకంగా సీఎం జ‌గ‌న్ శాపాలు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం జ‌గ‌న్ గురువారం నాడు వాలంటీర్ల కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు.

తాను ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న ఆయన.. దెయ్యాలు, రక్త పిశాచుల మాదిరి ప్రతిపక్షం-మద్ధతు పార్టీలు, అనుబంధ మీడియాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఢిల్లీ పర్యటనలో మోదీ జగన్‌కు క్లాస్‌ పీకారంటూ యెల్లో మీడియాలో కథనాలు వచ్చాయి.. యెల్లో మీడియాగానీ, దానికి అనుబంధం ఉన్నవాళ్లు ఎవరైనాగానీ ఆ టైంలో సోఫాల కిందగానీ దాక్కున్నారా? అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. జ‌గ‌న్ ఇలా హ‌మీలు అమ‌లు చేస్తే భవిష్యత్‌లో ఎవరూ ఓటు వేయరన్న భయమే వాళ్లతో అలాంటి పనులు చేయిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం కన్నా కనివినీ ఎరుగని రేంజ్‌లో సేవ అందిస్తున్నామని, నచ్చితే అభిమానించడని, నచ్చకపోతే తనను ద్వేషించడన్న సీఎం జగన్‌.. ఎల్లో పార్టీ, అనుబంధ ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రులు చెప్పే మాటల్ని మాత్రం నమ్మనే నమ్మొద్దంటూ ప్రజలను కోరారు సీఎం వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలోని వాలంటీర్లు ఎన‌లేని సేవ‌లు అందిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురించారు.

Next Story
Share it