Telugu Gateway
Andhra Pradesh

దిగిపోయిన పాలకుడు..చెడిపోయిన బుర్ర

దిగిపోయిన పాలకుడు..చెడిపోయిన బుర్ర
X

చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దిగిపోయిన పాలకుడు..చెడిపోయిన బుర్రతో ఏమి చేస్తున్నాడో చూస్తున్నాం. సొంతంగా బాగుపడేందుకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయించి...తాను భూములు కొనుగోలు చేసి ..తన బినామీలతో కూడా కొనుగోలు చేయించాడు. తాము కొన్న ఆ భూముల రేట్లు..ఎక్కడ పడిపోతాయే అని వాటిని కాపాడుకునేందుకు ఒక ఉద్యమం చేస్తున్నానని గ్గగ్గోలు పెడుతున్నారు. ఒక చెడిపోయిన బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుంది..ఒక మంచి బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ మంచి పని ప్రజలు ఎక్కడ చూస్తారో వింటారో అని ఎలా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా 'జనబేరి'తో ఓ సభ నిర్వహించారు. దీనిని ఉద్దేశించే సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న స్కీమ్ ల పేర్లు తాను తప్ప ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

. అక్కడ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. 'బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశాం. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. 'నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. రాకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది.

కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాల ప్రసక్తి లేకుండా అర్హులందరికీ సంక్షేమం అందాలి. ఆ బాధ్యతను మీరందరూ స్వీకరించాలి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. 18 నెలల్లోనే 90శాతానికి పైగా హామీలను నెరవేర్చాం. టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీలకు చేసిందేమీలేదు. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా బీసీలకు రూ.6140 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. సున్నా వడ్డీ పథకం ద్వారా 7.14 లక్షల బీసీ కుటుంబాలకు లబ్ది. ఈనెల 25న 31లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. 15 రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. కోర్టు అనుమతి రాగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం.' అని సీఎం జగన్‌ తెలిపారు.

Next Story
Share it