Telugu Gateway
Andhra Pradesh

ఇలాంటి బూతులు ఎప్పుడూ విన‌లేదు

ఇలాంటి బూతులు ఎప్పుడూ విన‌లేదు
X

ఏపీ సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి టీడీపీ ఆఫీసుల‌పై దాడి అంశంపై స్పందించారు. 'జగనన్న తోడు' కార్యక్రమం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ''ప్రజల ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓ వర్గం మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వాన్ని దారుణంగా బూతులు తిడుతున్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వ్యవస్థలను కూడా మ్యానేజ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధి పనులను కోర్టు కేసులతో అడ్డుకుంటున్నారు'' అని విమ‌ర్శించారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు.

ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు 'జగనన్న తోడు' పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్‌, జూన్‌లో 'జగనన్న తోడు' కార్యక్రమం నిర్వహిస్తాం. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామని'' సీఎం తెలిపారు.

Next Story
Share it