Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ లెక్క‌త‌ప్పుతోందా?!

జ‌గ‌న్ లెక్క‌త‌ప్పుతోందా?!
X

మాట్లాడితే కుప్పం కూడా మాదే అంటారు. కుప్పంతో ఆగ‌టం లేదు స‌రి క‌దా..ఏకంగా 175కు 175 సీట్లు కూడా వైసీపీకే రావాలి..ఈ దిశ‌గా ప‌నిచేయాల‌ని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆ పార్టీ మంత్రులు..ఎమ్మెల్యేలు..ఎంపీల‌కు ప‌దే ప‌దే సూచిస్తున్నారు. బుధ‌వారం నాడు సీఎం జ‌గ‌న్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో 27 మంది ఎమ్మెల్యేల ప‌నితీరు ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత మంది మంత్రులు కూడా ఉన్నారు. తీరు మార్చుకోకుంటే ఓకే...లేక‌పోతే ఇక అంతే సంగ‌తులు అని చెబుతున్నారు. ఎవ‌రికి టిక్కెట్ ఇవ్వ‌టంలేదో ఆ విష‌యం ఆరు నెల‌ల ముందే చెబుతాన‌ని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. 27 మంది తీరు బాగాలేద‌నే విష‌యంపై జ‌గ‌న్ సూటిగానే చెప్పార‌ని..ఇప్ప‌టికైనా ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని సూచించార‌ని మాజీ మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయితే విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అయితే ఈ లెక్క‌న చూసుకున్నా జ‌గ‌న్ లెక్క‌త‌ప్పుతున్న‌ట్లే క‌న్పిస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఓ వైపు 175 సీట్లు సాధించాల‌ని అంటూనే..మ‌రో వైపు 27 మంది ప‌నితీరు బాగాలేద‌ని స్వ‌యంగా జ‌గ‌నే చెప్ప‌టం విశేషం. అయితే ఈ పేర్లు చెప్పిన వారంతా ప‌రాజ‌యం పాలు అవుతార‌ని కాదు కానీ స్వ‌యంగా పార్టీ అధినేత వాళ్ల‌పై సంతృప్తి చెంద‌ని స‌మ‌యంలో..ప్ర‌జ‌లు వారి విష‌యంలో సంతృప్తి చెందుతారా అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌టం స‌హ‌జం. గెలుపు..ఓట‌ముల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌లు అంశాలు ప్ర‌భావం చూపిస్తాయ‌నే విష‌యం తెలిసిందే.

బుధ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, మ‌రోసారి వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం. నవంబర్‌లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని జ‌గ‌న్ తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం పీకె టీమ్ నిర్వ‌హించిన స‌ర్వేలో మాత్రం ప‌రిస్థితి ఏమంత ఆశాజ‌నకంగా ఉన్న‌ట్లు క‌న్పించ‌లేద‌ని నివేదికలు వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవ‌న్నీ గ‌మ‌నించే జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో జోష్ నింపేందుకే ప‌దే ప‌దే కుప్పంతోపాటు 175 సీట్ల జ‌పం చేస్తున్నార‌ని..మ‌రి ఈ ప్లాన్ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it