జగన్ సభల నుంచి జనం పరార్..దేనికి సంకేతం?!
సర్కారు సభలు అంటే చాలా ముందు జాగ్రత్తలు ఉంటాయి. అధికారంలో ఉన్న వారిని మెప్పించేందుకు సమావేశం జరిగే ప్రాంతానికి చెందిన అధికారులు నానా పాట్లు పడతారు. అన్ని ఏర్పాట్లు చేస్తారు. సభకు హాజరైన వారు అక్కడ నుంచి కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ కు సంబంధించి సభల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలోనే సభకు హాజరైన వారు మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. సోమవారం నాడు కూడా సేమ్ సీన్ రిపిట్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి చేసింది టీడీపీ సోషల్ మీడియా విభాగం కావొచ్చు...ఆ పార్టీ సానుభూతిపరులు కావొచ్చు. కానీ ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ఓ వైపు సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా..రూపాయి అవినీతి లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు చెబుతున్నారు. చాలా వరకూ అలా వేస్తూనే ఉన్నారు. అయినా మరి ఇలా ఎందుకు జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా చేస్తుంటే ప్రజలు ఆయనపై ఆదరణ చూపించాలి కదా. అలా కాకుండా సభ నుంచి వెళ్లిపోవటం..పోలీసులు వద్దని వారిస్తున్నా ఏదో కారణాలు చెప్పి వెళుతున్న ఘటనలు వీడియోలో స్పష్టంగా కన్పించాయి. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ సోమవారం నాడు ఏలూరులో పర్యటించారు. ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. 50.10 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ చేసింది. దీన్ని ఖరీఫ్ సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చింది. మరోవైపు సభ ప్రాంగణానికి చివరిలో ఉన్న కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోవటం ఒకెత్తు అయితే...చాలా వరకూ సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వటం కూడా చర్చనీయాంశంగా మారింది.