జగన్ వద్దకు కాకినాడ పంచాయతీ..టీ కప్పులో తుఫాన్
తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో తాజాగా చెలరేగిన వివాదంపై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. వివాదానికి కారణమైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా బహిరంగ వేదికలపై పరస్పర విమర్శలు చేసుకోవటం ఏ మాత్రం సరికాదని సూచించినట్లు సమాచారం. గతంలోనూ ఇలాగే విశాఖపట్నంలోనూ నేతల మధ్య విభేదాలు తలెత్తటం అక్కడ నుంచి నేతలను కూడా ఇలాగే జగన్ పిలిపించి మాట్లాడారు.
జగన్ తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరిని కూర్చోబెట్టి సీఎం మాట్లాడారన్నారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మేడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది. కాకినాడ మేడలైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించారు. కాకినాడ డీఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో తుపాను వంటిదే. ఆవేశంలో ఇలాంటి వివాదాలు సహజమే. ఒక్కొక్కరిది ఒక్కో తీరు.. నేను ఆవేశపరుడ్ని కాను అని బోస్ తెలిపారు.