Telugu Gateway
Andhra Pradesh

ప్రధాని మోడీకి జగన్ లేఖలు

ప్రధాని మోడీకి జగన్ లేఖలు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధానికి రెండు కీలక అంశాలపై లేఖలు రాశారు. అందులో అత్యంత కీలకమైనది భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశ ప్రజలను కాపాడేందుకు..వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఇదొక్కటే మార్గం అన్నారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించిన విషయాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. దీని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. మరో లేఖలో ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరా గురించి ప్రస్తావించారు.

ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్న అది ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపారు. 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏపికి మంజూరు చేయాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకుంటున్నామని అది సరిపోవడం లేదన్నారు. ఈనెల 10న చెన్నయ్ , కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ఆలస్యమైంది. ఆక్సిజన్‌ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న...20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు.

Next Story
Share it