విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..మోడీకి సీఎం జగన్ లేఖ
ఏపీ రాజకీయాలను ఇప్పుడు విశాఖ ఉక్కు వ్యవహారం కుదిపేస్తోంది. కేంద్రం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించంటతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం మొదలైంది. విశాఖ ఉక్కు..ఆంధ్రులు హక్కు అని సాధించుకున్న ఈ ప్రాజెక్టు ప్రైవేట్ పరం కానుందని తెలియటంతో అటు కార్మికులు, ఇటు రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కటై కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటివరకూ ఈ అంశంపై మౌనంగా ఉంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం నాడు ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. 'విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలి. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలి. విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు సాధన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్ మంచి పనితీరు కనపరిచింది. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయి.ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుంది.ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయి. స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చు.7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారు.
డిసెంబర్ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్ కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయి. వైజాగ్ స్టీల్స్ కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చు.'అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. మరి కేంద్రం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.