ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాలు
ఆంధ్ర్ర్రప్రదేశ్ పాలనలో కీలక పరిణామం. ఇప్పటివరకూ ఉన్న 13 జిల్లాలు ఇప్పుడు 26గా మారాయి. కొత్త జిల్లాల్లో పాలన కూడా సోమవారం నుంచే ప్రారంభం అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇది అన్నారు. ప్రజల సెంటిమెంట్లను, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని తెలిపారు. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని, సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమన్నారు.