Telugu Gateway
Andhra Pradesh

అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్

అమ్మ ఒడి వద్దంటే ల్యాప్ టాప్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రెండవ ఏడాది ఈ స్కీమ్ ను ప్రారంభిస్తూ విద్యార్ధులకు కొత్త ఆఫర్ ఇచ్చారు. విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. 4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌ డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌ తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తాం. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్‌ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులో జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలన్నదే లక్ష్యమని తెలిపారు.

అమ్మఒడి పథకం ద్వారా 45 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని, 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నాం. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరిగేదన్నారు. పరిస్థితులను మార్చేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు.

దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. ''దేవుడిపై భక్తి లేనివారు, ఆలయాల భూములను కాజేసిన వారు.. ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవారు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు.. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు.. రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని'' సీఎం జగన్‌ తెలిపారు.

Next Story
Share it