Top
Telugu Gateway

అంతర్వేదిలో కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

అంతర్వేదిలో కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
X

అంతర్వేదిలో తగలబడిపోయిన రథం స్థానే కొత్త రథం అందుబాటులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు అంతర్వేదిలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద ఉండే రథాన్ని తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనిపై సర్కారు ఏకంగా సీబీఐ విచారణకు సిఫారసు చేసినా వ్యవహారం ఏ మాత్రం ముందుకు సాగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తగలబడిపోయిన రథం స్థానే కొత్త రథాన్ని సిద్ధం చేయించింది. ఈ రథాన్ని శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం... అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు.

సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం జగన్ ఆ తర్వాత కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

Next Story
Share it