విభజన హామీల అమలు ఇంకెప్పుడు?

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతి వేదికగా జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. అందులో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. 'రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి'' జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.'పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్ గ్యాప్‌నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి'' అన్నారు. .''రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సవరణలు చేయాలి'' అని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 , ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు–2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూరై్తనా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. పోలవరం ప్రాజెక్టు... బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది.
సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా'. ఆ హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు.