Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు బాట‌లోనే జ‌గన్

చంద్ర‌బాబు బాట‌లోనే జ‌గన్
X

ఏపీలో జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు అట‌

సేమ్ టూ సేమ్. అప్పుడు చంద్ర‌బాబు ఏమి చేశారో..ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. ఏపీలో ప్ర‌తి జిల్లాకు ఓ విమానాశ్ర‌యం ఏర్పాటు అన్న‌ది మంచి కాన్పెస్ట్ అని..దీనిపై ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 2017 జ‌న‌వ‌రిలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఇదే త‌ర‌హాలో జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు డెవ‌ల‌ప్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అప్పుడు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి గా రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజే ఉన్నారు. బ‌హిరంగంగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు దీనిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా అస‌లు జిల్లాకు ఒక విమానాశ్ర‌యం ఎలా సాధ్యం అవుతుంద‌ని..ట్రాఫిక్ తోపాటు ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కానీ వీటిపై నిర్ణ‌యాలు తీసుకోవ‌టం సాధ్యంకాద‌ని అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఆయ‌న చంద్ర‌బాబుకు తేల్చిచెప్పారు. అయితే అశోక్ వాద‌న‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు అప్ప‌ట్లోనే పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. కానీ చంద్ర‌బాబు హ‌యాంలో ఈ దిశ‌గా జ‌రిగింది శూన్యం. అప్ప‌ట్లో చంద్ర‌బాబు త‌ల‌పెట్టిన భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ అదే ప్రాజెక్టుకు ఓకే చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ సీఎం అయి దాదాపు మూడేళ్ళు కావ‌స్తోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రాజెక్టు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఇంకా అడుగు ముందుకుప‌డ‌లేదు.

ఇంకా కొన్ని భూ సేక‌ర‌ణ వివాదాల కార‌ణంగా ఈ ప్రాజెక్టు ద‌క్కించుకున్న జీఎంఆర్ సంస్థ ముందుకు క‌ద‌లేక‌పోతోంది. రాష్ట్రానికి అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని విష‌యంలోనే ఇంకా పెద్ద‌గా పురోగ‌తి లేద‌నే చెప్పొచ్చు. ఈ త‌రుణంలో జ‌గ‌న్ గురువారం నాడు విమానాశ్ర‌యాలు, పోర్టుల‌పై స‌మీక్ష నిర్వ‌హించి వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు.

విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇక్క‌డ మరో విష‌యాన్ని గుర్తుచేసుకోవాలి. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో అంటే..వైఎస్ హ‌యాం నుంచి పెండింగ్ లో ఉన్న మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు ప్రాజెక్టు చేప‌ట్టేందుకు ఈపీసీ ప‌ద్ద‌తిలో స‌ర్కారు రెండు సార్లు టెండ‌ర్లు పిలిచినా ఒక్కటంటే ఒక్క నిర్మాణ సంస్థ ఈ ప‌నులు చేప‌ట్టేందుకు ముందు రాలేదు. రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక ప‌రిస్థితిని గ‌మ‌నించి..ఇత‌ర కార‌ణాల కార‌ణంగానే ఏ సంస్థ కూడా ఈ ప‌నులు టేకప్ చేయ‌టానికి ఆస‌క్తి చూప‌లేదు. ఈ త‌రుణంలో జిల్లాకు ఓ విమానాశ్ర‌యం అస‌లు జ‌రిగే ప‌నేనా?. అందుకు భూ సేక‌ర‌ణ‌, కేంద్ర నుంచి అనుమ‌తులు పొంద‌టం..విమానాశ్ర‌య ప్రాజెక్టుల టేకాఫ్ సాధ్యం అవుతుందా? అంటూ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.

Next Story
Share it