Telugu Gateway
Andhra Pradesh

వైఎస్ పోటోనూ 'ప‌క్క‌న పెడుతున్న జ‌గ‌న్!'

వైఎస్ పోటోనూ  ప‌క్క‌న పెడుతున్న జ‌గ‌న్!
X

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చారంటే దానికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఎందుకంటే వైఎస్ స్కీమ్ లు..ఆయ‌న పాల‌న పేరు చెప్పుకునే జ‌గ‌న్ పార్టీ పెట్టి..అధికారంలో వ‌చ్చారు. లేదంటే అంత‌కు ముందు జ‌గ‌న్ కు ఏమీ ప‌రిపాల‌నా అనుభ‌వం కానీ..ఇత‌ర ప్ల‌స్ పాయింట్స్ ఏమీలేవు. వైఎస్ అన్న పేరే జ‌గ‌న్ ను అధికారానికి ద‌గ్గ‌ర చేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న పాద‌యాత్ర మ‌రో అంశం. ఎంత పాద‌యాత్ర చేసినా..ప్ర‌జ‌ల్లో ఆయ‌న నిల‌బ‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ హ‌యాంలో అమలు చేసిన ఆరోగ్య శ్రీ, రైతుల‌కు ఉచిత విద్యుత్..పెన్ష‌న్ల వంటి స్కీమ్ లు ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. జ‌గ‌న్ ఏపీ సీఎం అయి మూడేళ్ళు అవుతోంది. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని రీతిలో ప్ర‌తి ప‌థ‌కానికి ఇప్పుడు సీఎం జ‌గ‌న్ పేరును ప్ర‌తి ప‌థ‌కానికి ముందు జ‌గ‌న‌న్న అని త‌గిలిస్తున్నారు. అస‌లు ఈ పేర్లు ఎన్ని ప‌థ‌కాల‌కు ఉన్నాయో లెక్కేలేదు. కొన్ని ప‌థ‌కాల‌కు మాత్రం దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరును కొన‌సాగిస్తున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వైఎస్ఆర్ యంత్ర సేవా ప‌థ‌కం పేరుతో మంగ‌ళ‌వారం నాడు ప‌త్రిక‌ల్లో ఫుల్ పేజీ యాడ్స్ ద‌ర్శ‌నం ఇచ్చాయి.

అది ఏమిటంటే ట్రాక్ట‌ర్లు.కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ. పేరు అయితే వైఎస్ఆర్ పేరు పెట్టారు కానీ..ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా కూడా ఓ మూల‌న కూడా దివంగ‌త వైఎస్ఆర్ ఫోటో మాత్రం లేకుండా చేశారు. గ‌తంలో ఇదే జ‌గ‌న్ స‌ర్కారు వైఎస్ఆర్ పేరుతో ఉన్న ప‌థ‌కాల‌కు ఆయ‌న ఫోటోను కూడా వాడేవారు. కానీ ఇప్పుడు వైఎస్ పోటోను తీసేసి..పూర్తిగా అన్ని చోట్ల ఒక్క జ‌గ‌న్ ఫోటోను మాత్ర‌మే ఉంచారు. గ‌తంలో ఇదే ప్ర‌భుత్వం వైఎస్ఆర్ చేయూత పేరుతో ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. అందులో యాడ్ పైభాగాన ఓ ప‌క్క‌న దివంగ‌త నేత ఫోటోను పెట్టారు. కానీ వైఎస్ఆర్ యంత్ర సేవా ప‌థ‌కం యాడ్ వ‌చ్చేస‌రికి వైఎస్ఆర్ ఫోటో ఎగిరిపోయింది. ఎవ‌రి పేరు ఉప‌యోగించుకుని జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారో చివ‌ర‌కు ఆయ‌న ఫోటో కూడా ప్ర‌భుత్వ యాడ్స్ లో లేకుండా చేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫుల్ పేజీ యాడ్స్ లో ఆయా శాఖ‌ల మంత్రుల పేర్లు త‌ప్ప స్టాంప్ సైజ్ ఫోటోలు కూడా ఉండ‌ని విష‌యాన్ని గ‌తంలో ఓ సారి ఇక్క‌డే ప్ర‌స్తావించుకున్నాం. ఇప్పుడు ఏకంగా వైఎస్ ఫోటోను కూడా ఎత్తేయటం పెద్ద సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్పొచ్చు.

Next Story
Share it