జగన్ 'ఇరుక్కున్నారు'!
రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయటం వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉ ఏ మాత్రం ఇష్టం లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ భూములన్నీ చంద్రబాబు..ఆయన బినామీలేనని పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో అమరావతి అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు కావాలని..దీనికి వందేళ్లు పడుతుందని తాజాగా ప్రకటించారు కూడా. పోనీ సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల వ్యవహారం అయినా ముందుకు సాగుతుందా అంటే ఆ ఛాన్స్ ఇప్పటివరకూ అయితే కనుచూపు మేరలో కన్పించటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఓ సారి రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ అసెంబ్లీకి దీనిపై తీర్మానం చేసే అధికారం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై వెళితే ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్ళాలి. కానీ అదీ జరగలేదు. అయినా స రే కొంత మంది మంత్రులు మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తామని..తమ విధానం అమలు చేసి తీరతామని ప్రకటించారు. కానీ చట్టపరమైన అంశాలను పరిశీలిస్తే కేంద్రం పార్లమెంట్ లో విభజన చట్టానికి సవరణలు చేస్తే తప్ప మూడు రాజధానుల అమలు అనేది జరిగే పని కాదనే వాదన ఎక్కువగా ఉంది. కేంద్రంలోని బిజెపి, మోడీ సర్కారు జగన్ కోసం ఇంత రిస్క్ చేస్తుందా?. ఓ వైపు బిజెపి అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్న తరుణంలో ఇది జరిగే పనేనా అన్న సందేహాలు ఉన్నాయి. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయలేదని..ప్రతిపక్షంలో ఉండగా పదే పదే విమర్శలు చేసిన జగన్ తాను అధికారంలోకి వచ్చాక మాత్రం రాజధాని కట్టి రైతులకు మేలు చేస్తానని ప్రకటించి ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు.
ఐదేళ్ళు చంద్రబాబు రాజధాని అభివృద్ధి చేయలేదని విమర్శించిన జగన్ తాను అనుకుంటున్న మూడు రాజధానులను కూడా మూడు అడుగులు ముందుకు వేయించలేకపోయారు. ఇప్పటికే ఆయన పరిపాలనా కాలం దాదాపు మూడున్నర సంవత్సరాలు పూర్తయింది. మరి మిగిలిన కాలంలో మూడు రాజధానులపై ముందుకు పోవాలంటే చట్టపరమైన చిక్కులెన్నో. అమరావతిపై ఏ మాత్రం ఆసక్తిలేదు..మూడు రాజధానులు ముందుకు సాగవు. ఇలా జగన్ రాజధాని విషయంలో ఇరుక్కుపోయినట్లు అయిందనే చర్చ అటు వైసీపీ వర్గాలతోపాటు ఇటు అధికార వర్గాల్లోనూ సాగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగన్ వైజాగ్ నుంచే పరిపాలన చేస్తారని చెబుతున్నారు. సీఎం జగన్ అక్కడికి వెళ్ళి కూర్చుంటే రాజధాని వెళ్ళినట్లు కాదు..వైసీపీ మూడు రాజధానుల హామీ అమలు అయినట్లు కాదు. మరి చంద్రబాబు రాజధాని కట్టకుండా ఐదేళ్ళు వేస్ట్ చేశారని విమర్శించిన జగన్..కారణాలు ఏమైనా ఆయన కూడా అదే పని చేశారనే విమర్శలు మూటకట్టుకోవటం ఖాయం. దీంతో అటు అమరావతి కాకుండా..మూడు రాజధానులు అమలు చేయకుండా జగన్ కూడా రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు అవుతుందనే వాదన ఉంది.