Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ నాయకులు కూడా విస్మయం

వైసీపీ నాయకులు కూడా విస్మయం
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి పత్రిక మరో సారి అడ్డంగా బుక్ అయింది. గతం లో కూడా మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఇదే సాక్షి పత్రికలో నారా సుర రక్త చరిత్ర అంటూ స్టోరీ ప్రచురించారు. కానీ సిబిఐ విచారణలో చంద్రబాబు కాదు కదా అటు వైపు విచారణా సంస్థలు కన్నెత్తి కూడా చూడని విషయం తెలిసిందే. విచిత్రం ఏమిటి అంటే వివేకా హత్య కేసు లో వేళ్ళు అన్ని కూడా వై ఎస్ అవినాష్ రెడ్డి, అయన తండ్రి భాస్కర్ రెడ్డి ల వైపు చూపించటం. ఇది అంతా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలోనూ సాక్షి మరో సారి బుక్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసు లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని సిఐడి శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కు సంబంధించి కోర్ట్ కు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబు ని సిఐడి నిందితుడు 37 అంటే ఏ 37 గా పేర్కొంది. కానీ సీఎం జగన్ సొంత పత్రిక సాక్షిలో మాత్రం చంద్రబాబు ఏ 1 గా ప్రస్తావించారు. సిఐడి ఏ 37 గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటే అసలు సాక్షి కి చంద్ర బాబు ఏ 1 అని ఎవరు చెప్పారు...ఎలా ఈ విషయంలో నిర్దారణకు వచ్చింది అన్నది ఇప్పుడు అటు వైసీపీ వర్గాలతో పాటు అధికారుల్లోనూ చర్చ సాగుతోంది.

ఒక వైపు సీఎం జగన్ ఈనాడు, ఆంధ్ర జ్యోతిలపై నిత్యం విమర్శలు చేస్తూ ఇలా తన సొంత పత్రికలోనే ప్రభుత్వం విచారణ చేసే కేసుల్లో సొంతగా ఏ 1 గా తేల్చేస్తారా అనే చర్చ సాగుతోంది. సాక్షి చంద్రబాబు ను ఏ 1 గా తేల్చేస్తే విచారణ జరిపిన సిఐ డి మాత్రం ఏ 37 అని కోర్ట్ కు సమర్పించిన రిపోర్ట్ లో పేర్కొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో కనీసం 279 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో సిఐడి పేర్కొంది. దీనిపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసి చాలా మందిని అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత కూడా స్కాం విలువ పై ఖచ్చితంగా ఒక నిర్దారణకు రాకుండా కనీసం 279 కోట్లు (ఎట్ లీస్ట్ 279 కోట్లు ) అని చెప్పటం కూడా కేసు లో వీక్ నెస్ ను తెలియచేస్తుంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. మరి ఇతర పత్రికలు అసత్యాలు రాస్తాయంటూ సీఎం జగన్ చేసే విమర్శలకు వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో విలువ ఉంటుందా అన్న చర్చ కూడా వైసీపీ నేతల్లో సాగుతోంది.

Next Story
Share it