Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో వాహ‌న‌మిత్ర కింద 248 కోట్ల రూపాయ‌లు పంపిణీ

ఏపీలో వాహ‌న‌మిత్ర  కింద 248 కోట్ల రూపాయ‌లు పంపిణీ
X

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాహ‌న‌మిత్ర ప‌థ‌కం కింద మంగ‌ళ‌వారం నాడు 248 కోట్ల రూపాయ‌ల మేర పంపిణీ చేశారు. తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యం నుంచి ఆన్ లైన్ ద్వారా ఆయ‌న ఈ నిధుల‌ను పంపిణీ చేశారు. వాహ‌న‌మిత్ర కింద నిధుల పంపిణీ ఇది మూడ‌వ‌సారి. తాజాగా ఇచ్చిన 248 కోట్ల రూపాయ‌ల‌తో క‌లుపుకుంటే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ప‌థ‌కం కింద 759 కోట్ల రూపాయ‌లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ పాద‌యాత్ర‌లో ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలను నేరుగా చూడటం ద్వారా వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వర‌సగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు చేశామని తెలిపారు. టీడీపీ హయాంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించిన విషయాన్ని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని, 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేస్తున్నామన్నారు.

2.48 లక్షల మందిలో దాదాపు 84% పేదవర్గాల వారే ఉన్నారని ఈ సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని, దేశంలో ఎక్కడా డ్రైవర్ల కోసం ఇలాంటి పథకం లేదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌, రిపేర్లకు 10వేల రూపాయ‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని, వైఎస్ఆర్‌ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దని కోరుతున్నానని సీఎం జగన్‌ తెలిపారు.

Next Story
Share it