పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చేతికి పీఆర్సీ నివేదిక చేరింది. తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీఎస్ సమీర్ శర్మ సారధ్యంలోని అధికారుల కమిటీ నివేదిక, సిఫారసులు అందజేసి ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చింది. ఉద్యోగ సంఘ నేతలకు కాపీలు ఇవ్వటంతోపాటు వెబ్ సైట్ లో కూడా దీన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఎవరైనా సరే డౌన్ లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చన్నారు. పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 72 గంటల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని సీఎస్ మీడియాకు తెలిపారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ లపై కార్యదర్శుల కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందజేశారు.
అందులో 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేశారు. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ అందులో ప్రస్తావించింది. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్ వెల్లడించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో తలసరిఆదాయం చాలా తక్కువగా ఉందని, దీంతోపాటు 6284 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉందన్నారు. వీటితోపాటు రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి ఇంకా 18969 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు.